Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్‌యూ (విజృంభణ) హైదరాబాద్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కమిటీ ఆధ్వర్యంలో శనివారం హిమాయత్‌నగర్, లిబర్టీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట ఈనెల 28న నిర్వహించే సదస్సు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పీడీఎస్‌యూ (విజృంభణ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనంద్, గ్రేటర్ అధ్యక్షులు దుర్గం దిలీప్ మాట్లాడుతూ తెలంగాణ పాలకులు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు ప్రభుత్వ బిల్డింగుల నిర్మాణానికి, సమస్యల పరిష్కారానికి ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల హాస్టళ్లు, గురుకులాలు సమస్యలకు నిలయాలుగా మారి, నయా బంజరు దొడ్లను తలపిస్తున్నాయని విమర్శించారు. 'సన్న బియ్యం పేరుతో హాస్టళ్లకు నూకల రాళ్లు, పురుగుల బియ్యం పంపుతున్నారన్నారు. మెస్ చార్జీలు పెంచడం లేదు. లైబ్రరీలు, రీడింగ్ హాల్, పోటీ పరీక్షల పుస్తకాలు, సబ్జెక్టు పుస్తకాలు లేవు' అని ఆరోపించారు. విద్యార్థులు పాకెట్ మనీ కోసం కేటరింగ్ (ఆహార వడ్డింపు) పనులకు వెళ్తూ అర్థ కార్మికులుగా మారుతున్నారని వాపోయారు. పతి విద్యార్థికి రూ.1,000 స్టై ఫండ్ ఇవ్వాలని, హాస్టళ్లకు పక్కా బిల్డింగులు నిర్మించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్, ఉపాది కల్పన కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రభుత్వ పాలకులపై ఒత్తిడి పెంచేందుకు మార్చి 28న కోఠిలోని సాంఘీక సంక్షేమ హాస్టల్లో జరగబోయే సదస్సులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ(విజంభణ) నాయకులు చెనగోని గణేష్, గురుకుల సంక్షేమ హాస్టళ్ల పోరాట కమిటీ నాయకులు బొమ్మకంటి నిఖిల్, ఎడవెల్లి శ్రీకాంత్, పెద్దూరి మధు, బి.రాహుల్, టి.సాయి, రాజు, దినేష్, అన్వేష్ పాల్గొన్నారు.