Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతోందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. జాతీయ సంపద, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలను ప్రజా సేవా విభాగాలను ప్రయివేట్, కార్పొరేట్ వ్యాపార వర్గాలకు అమ్మేస్తున్న బీజేపీ ప్రభుత్వ పాలనకు నిరసనగా మార్చి 28, 29న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఎల్ఐసీ, రైల్వే, పోర్టులు, ఎయిర్ లైన్స్, పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు, జాతీయ రహదారులు, కేంద్ర యూనివర్సిటీలు, కేంద్ర మెడికల్ రీసెర్చ్ సెంటర్స్, నేషనల్ కంపెనీలు, మిలిటరీ రీసెర్చ్ సెంటర్స్, స్టీల్ ప్లాంట్లు, జెన్ కో సంస్థలు, సింగరేణి తదితర సంస్థలను రిలయన్స్ అంబానీ, ఆదానిలకు అమ్మేస్తూ దేశ ప్రజలను బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ఆరోపించారు. తద్వారా రాజ్యాంగ పరమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లను రద్దు చేస్తున్నారన్నారు. కేంద్ర సర్కార్ 5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. కార్మికులు, రైతుల రాజ్యాంగ చట్టాలను సవరించి, కష్ట జీవులకు అన్యాయం చేస్తున్నారన్నారు. లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, ప్రయివేటీకరణ విధానాన్ని ఆపాలని, కేంద్ర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేక మోడీ విధానాలకు నిరసనగా మార్చి 28, 29న జాతీయ స్థాయిలో జరిగే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు పాల్గొని, విజయవంతం చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిలివెరీ వసంతరావు, ప్రధాన కార్యదర్శి చేపూరి రాజు, గ్రేటర్ అధ్యక్షులు మద్దెల ప్రవీణ్ కుమార్, డీబీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఇటికాల గణేష్, జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి నాయకులు సి.శ్యామ్ కుమార్, మాలమహానాడు జాతీయ మహిళా ఉపాధ్యక్షులు యు.పద్మ తదితరులు పాల్గొన్నారు.