Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.17,700 కోట్లతో 18 లక్షల కుటుంబాలకు దళితబంధు ఎలా ఇస్తారు
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-మల్కాజిగిరి
'దళితబంధు పథకం అర్హులైన వారికి కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల రాజకీయ జోక్యంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అందేలా చేస్తున్నారు. దీన్ని ప్రతిఘటించి దళితులందరికీ ఇవ్వాలని కేవీపీఎస్ ద్వారా ఇంటింటి సర్వేలు చేసి దశల వారీగా పోరాటాల ద్వారా అర్హులకు అందేలా చూడాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం మల్కాజిగిరి సర్కిల్ ఓల్డ్ నేరేడ్ మెట్ లోని అంబేద్కర్‌లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేవీపీఎస్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుంటి లక్ష్మణ్ అధ్యక్షత నిర్వహించగా, ముఖ్య అతిథులుగా స్కైలాబ్ బాబు, జిల్లా అధ్యక్షులు ఎం.కృపాసాగర్, సీఐటీయూ జిల్లా నాయకులు చింతల యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ దళిత బంధు రాష్ట్రంలో దళితులందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితి పెట్టాలన్నారు. కేవలం రూ.17, 700 కోట్లతో 18 లక్షల కుటుంబాలకు దళితబంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తక్షణమే కనీసం రూ.30 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మూడెకరాల భూమి పథకం సీఎం రద్దు చేసే విధంగా బడ్జెట్లో నయా పైసా కేటాయించలేదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ బడ్జెట్‌కు కాగితాల్లో అంకెలు పెరిగిపోతున్నాయి కానీ అవి ఖర్చు కావడం లేదన్నారు. ఏడేండ్లలో రూ.81 వేల కోట్లు కాగితా ల్లో కేటాయించి అందులో సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులందరికీ అందాలంటే కనీసం రూ.1500 కోట్లు కేటాయించాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తరహాలో 300 యూనిట్ల వరకు తెలంగాణలో కూడా ఉచిత కరెంటు ఇవ్వాలనీ, జీవో 342ను సవరించి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర సర్కార్ పథకం ప్రకారమే దళితుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ రిజర్వేషన్లకు సమాధి చేస్తుందన్నారు. దళితుల ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ నోటి కాడి బుక్క లాగేస్తుందన్నారు. బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం, స్వాతంత్య్ర జెండాను ఎప్పుడూ గౌరవించలేదన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో రాజ్యాంగాన్ని సమీక్షించడానికి ఒక ప్రత్యేక కమిషన్ వేసిందనీ, రాజ్యాంగం తమ పవిత్ర గ్రంథం కాదు భగవద్గీత తమ పవిత్ర గ్రంథమని నాడు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించిందన్నారు. దళితుల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసి దళితులకు తీరని ద్రోహం చేసిందన్నారు. మహిళలపై హింస పెరిగిందనీ, భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నదనానరు. లౌకిక శక్తుల ఐక్యత దేశానికి తక్షణ అవసరం ఉందన్నారు. సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాయకులు చింతల యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదన్నారు. దళిత బంధు మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టి వారి కార్యకర్తలకు పలహారంగా పంపుతున్నారన్నారు. కేవీపీఎస్ ద్వారా గ్రామ గ్రామాన దళిత యువతీ యువకులను సమీకరించి దశలవారీగా ఆందోళన, పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఎలాంటి షరతులు లేకుండా అర్హులందరికీ నేరుగా ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలతో ఇల్లు నిర్మాణం చేపడతామని సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారనీ, ఏ మాత్రం లేట్ చేయకుండా పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.బాలు, జిల్లా నాయకులు గట్టు అశోక్, ఎం.అంజన్న, బి.శ్రీనివాస్, పురుషోత్తం, వీరభద్రం, సురేష్, నరసింహ, ఏడుకొండలు, సుమిత్ర, అరుణ, రాములు, తదితరులు పాల్గొన్నారు.