Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
ఆసరా పింఛన్లు సకాలంలో అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు అవస్థలు ఎదుర్కొంటున్నారనీ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సోమవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు మొనార్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. అంబేద్కర్ నగర్, డెంటల్ కాలేజ్, మల్కారం వికలాంగుల కాలనీ పరిసర ప్రాంతాల్లో నుంచి ఆసరా పెన్షన్ కోసం రూ.వంద ఆటో కిరాయి పెట్టుకుని వారం రోజులుగా ప్రతి రోజూ వచ్చి వెళ్లిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ మంజూరు చేయాలనీ, జవహర్ నగర్లో మాత్రం అధికారులు ఇంతవరకు ఎలాంటి సమాచారం లబ్దిదారులకు ఇవ్వడం లేదన్నారు. ఇకనైనా ఆసరా ప్రతి నెలా మొదటి వారంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోస్ట్ ఆఫీస్ సిబ్బంది వల్ల ఇబ్బంది కలుగుతుందనీ, ప్రతినెలా బ్యాంకులో జమ చేసేలా చూడాలని కోరారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రతి నెలా మొదటి వారంలో అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. లబ్దిదారులకు వచ్చే పింఛన్లో రూ.16 చిల్లర లేవని సాకుగా చూపించి ఇవ్వడం లేదనన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటలపాటు రవాణా స్తంభించిపోయింది. ఘటనా స్థలానికి పోలీసుల రాకతో సంబంధిత అధికారి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జ్యోతి రెడ్డి మాట్లాడుతూ ఒక్కటి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ నాయకులు బండకింది ప్రసాద్ గౌడ్, మాట్లా వినరు, దనమ్మ, సరిత, టీడీపీ నాయకులు లక్ష్మణ్, అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు, ప్రధాన కార్యదర్శి దామెర రాజేందర్, కిరణ్ నర్సింగ్, వినరు, తదతరులు పాల్గొన్నారు.