Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులు
నవతెలంగాణ-బోడుప్పల్
అన్యాక్రాంతం అవుతున్న చెరువులను, కుంటలను కాపా డేందుకుగాను నగరంలోని అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను పకడ్బందీగా నిర్ణయించి ఆ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం ఎఫ్టీ ఎల్ హద్దులు నిర్ణయించిన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికారులే దగ్గరుండి సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టడం విడ్డూరంగా ఉంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్కుంట చెరువు శిఖం ప్రాంతంలో చెరువు భూమి కబ్జా కాకుండా గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎఫ్టీఎల్, బఫ్పర్ జోన్ హద్దులు నిర్ణయించారు. సదరు ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు మాత్రం నిబంధనలకు నీళ్ళు వదిలి ఎఫ్టీఎల్ పరిధిలో సీసీ రోడ్డు వేశారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ పరమేష్ మేడిపల్లి మండల రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ఎఫ్టీఎల్ హద్దులు నిర్థారించిన ప్రాంతాలలో సీసీ రోడ్లు వేయకుండా ఆదేశాలు జారీ చేశాం కాని ఇక్కడ సీసీ రోడ్డు వేశారు దీనిపై మా ఉన్నతాధికారులకు నివేదిక అందచేస్తామని వివరించారు.
రోడ్డు వేస్తే తప్పేంటి?
- డీఈ కుర్మయ్య నిర్లక్ష్యపు సమాధానం
ఎఫ్టీఎల్ పరిధిలో సీసీ రోడ్లు వేయకూడదనే నిబంధనపై మున్సిపల్ కార్పొరేషన్ డీఈ కుర్మయ్యను వివరణ అడగ్గా సీసీ రోడ్లు వేస్తే తప్పేంటని ఒకసారి, సీసీ రోడ్లు వేసిన సంగతి నాకు తెలియదని మరోసారి నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. గతంలో సీసీ రోడ్డు వేసేందుకు ప్రయత్నాలు చేయగా ఫిర్యాదులు రావడంతో రోడ్డు పనులు నిలుపుదల చేశారు. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సెలవు దినాల్లో రాత్రికి రాత్రే రొడ్డు వేయడం వెనుక ఆంతర్యం ఏంటో అధికారులకే ఎరుక.