Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనన, మరణ ధ్రువపత్రాల జారీ విభాగంలో లొసుగులు
- ఓఆర్‌జీఐ పోర్టల్‌పై నిర్లక్ష్యం
- సొంత పోర్టల్‌కు లక్షల్లో ఖర్చు
- బల్దియా ఆదాయానికి గండి
నవతెలంగాణ-సిటీబ్యూరో
జనన, మరణ ధ్రువపత్రాల జారీ విభాగానికి నకిలీ సర్టిఫికెట్ల బెడద తప్పడం లేదు. అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జీహెచ్ ్ఎంసీ ఆదాయానికి దీనివల్ల భారీగా గండిపడుతోంది. అయినా కొత్త సాప్ట్వేర్, సొంత పోర్టల్ ఏర్పాటు, నిర్వహణ పేరుతో లక్షల రూపాయలు ఖర్చుచేస్తోంది. అయినా జీహెచ్ఎంసీ జనన, మరణ ధృవపత్రాల జారీ విభాగానికి ఇబ్బందులు తప్పడంలేదు. నకిలీ సర్టిఫికెట్ల దందాకు అడ్డుకట్ట పడటంలేదు. దేశవ్యాప్తంగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి ఒకే పోర్టల్ ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఓఆర్‌జీఐ) పోర్టల్‌కు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ అలా చేయకుండా లక్షల రూపాయలను ఖర్చుచేసి సొంత పోర్టల్‌ను రూపొందించేపనిలో నిమగమైంది. జీహెచ్ఎంసీకి ఇది అదనపుప భారంగా మారింది.
ఏటా రూ.3.15 కోట్ల నష్టం
జనన, మరణ ధ్రువపత్రాల జారీ ద్వారా జీహెచ్ ఎంసీకి ఏడాదికి సుమారు రూ.3.15 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ రెండు ధృవపత్రాల కోసం జీహెచ్ఎంసీలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లలో దరఖాస్తు చేసుకుంటే రూ.20 చెల్లిస్తే ఆమోదిస్తారు. తర్వాత ఎక్కడైనా తీసుకో వచ్చు. ఇప్పుడు ఈ బాధ్యతను మీ సేవా కేంద్రాలకు అప్పగించారు. నిధుల్లేక అసలే ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్ఎంసీ అక్షరాల రూ.3.15 కోట్ల నష్టం మూటగట్టుకుంటోంది. మీసేవా కేంద్రాల్లో రూ.20 కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో జనన ధ్రువపత్రాలు 1.50 లక్షలు, మరణ ధ్రువపత్రాలు 60 వేల వరకు ఉంటున్నాయి. ఇందులో జనన ధ్రువపత్రాలను సరాసరిగా మూడు చొప్పున, మరణ ధ్రువపత్రాలు వివిధ అవసరాలైన ఇన్సూరెన్స్, బ్యాంకు, ఆస్తి తగాదాల్లోనూ తప్పనిసరైంది. దీంతో సుమారుగా10 ధ్రువపత్రాలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఇలా జనన ధ్రువ పత్రాలు 4.50లక్షలు, మరణ ధ్రువపత్రాలు 6 లక్షలు మొత్తం 10.50 లక్షల పత్రాలను తీసుకుంటున్నారు. అయితే, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లో ఒక్కో ధ్రువపత్రానికి రూ.20చొప్పున అయితే రూ.2.10కోట్లు అవుతుంది. మీసేవా కేంద్రాల్లో అయితే సగటున ఒక్కో దానికి రూ.30 చొప్పున రూ.3.15కోట్లు అవుతుంది. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో రూ.100 నుంచి 500 వరకు సైతం వసూలు చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.
నకిలీ సర్టిఫికెట్ల దందా
గ్రేటర్ హైదరాబాద్‌లో నకిలీ జనన, మరణ ధృవపత్రాల దందా జోరుగా సాగుతుంది. ఈ దందా జీహెచ్ఎంసీ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తోందని, అందుకు ఓ అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పట్టుబడడమే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఓఆర్‌జీఐ పొర్టల్ ఏర్పాటు చేస్తే నకిలీ సర్టిఫికెట్ల జారీని అరికట్టడానికి అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ రూపొందించిన కొత్త సాప్ట్వేర్ కారణంగానే నకిలీ సర్టిఫికెట్ల దందాకు వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఉన్నతాధి కారులు జనన, మరణ ధృవపత్రాల జారీ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.