Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఎన్.పాండయ్య
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే వీరనారి మల్లు స్వరాజ్యం మరువలేని మహానేత, త్యాగశీలి అని వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ ప్రెసిడెంట్ ఎన్.పాండయ్య అన్నారు. సోమవారం ఉదయం బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తుపాకీ పట్టిన యోధురాలు మల్లు స్వరాజ్యం అని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస విడిచేవరకు పోరాడిన ధీరవనిత అని కొనియాడారు. వెట్టిచాకిరి అంతం చేయడానికి ఆమె త్యాగం చేశారని చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లు స్వరాజ్యం నాడు పేదల ప్రజల గొంతుకగా నిలిచార న్నారు. గొప్ప వక్తగా ప్రజలపట్ల కమిట్మెంట్ ఉన్న నాయకురాలిగా జాతీయస్థాయి వరకు ఎదిగారని తెలిపారు. చివరకు తన భౌతిక కాయాన్ని కూడా నల్లగొండ మెడికల్ విద్యార్థుల పరిశోధన కోసం రాసిచ్చారని చెప్పారు. ఆమె పోరాట స్ఫూర్తిని, త్యాగాలను ఎన్నటికీ మరువలేమని, ఆమె స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సుందరయ్య పార్కు కార్యదర్శి సంతోష్ గౌడ్, కోశాధికారి సలిపెల రమేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ఎంఎన్ఆర్ రావు, పార్క్ మాజీ ప్రెసిడెంట్లు నాగభూషణం, రాజేంద్రప్రసాద్, దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంపత్‌రెడ్డి, వాకర్స్ క్లబ్ ముఖ్యులు కిషన్‌రావు, ఎండి. రఫీ, రాఘవరెడ్డి, కపానందం, బొల్లి స్వామి, టి. స్కైలాబ్ బాబు, భగత్, గోపాల్ శంకర్, చంద్ర శేఖర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.