Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నగర కమిటీ విజ్ఞప్తి
- హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ స్థలాల్లోని పేదల ఇండ్లను ఉచితంగా క్రమబద్దీ కరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న జిఓనెం.58పై తగిన అవగాహన, విశ్వాసం లేకపోవడంతో ప్రజలు స్పందించడంలేదని, దీనిపై అవగాహన కల్పించాలని సీపీఐ(ఎం) నగర కమిటీ కోరింది. ఈ విషయంపై హైదాబాద్ జిల్లా కలెక్టర్కు సీపీఐ(ఎం) బృందం సోమవారం వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక బస్తీలు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నప్పటికీ తగిన సమాచారం లేకపోవడంతో క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోవడంలేదని, ఈనెల 31వ తేదీతో గడువు ముగియనుండడంతో తగిన స్పందనరావడంలేదని అన్నారు. గతంలోనూ ఈ జీఓ ఆధారంగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతో ప్రజలకు క్రమబద్దీకరణపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. దీనిపై అన్ని మండల కార్యాలయాల పరిధిలోని బస్తీల్లో జీఓ నెం.58పై విస్తృతంగా అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించాలని కోరారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్, నగర కమిటీ సభ్యులు సి.మల్లేష్, నాంపల్లి జోన్ కమిటీ సభ్యులు వెంకటస్వామి పాల్గొన్నారు.