Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ జాగ్రఫీ విభాగం ఆధ్వర్యంలో 'ఫారెస్ట్స్ అండ్ సస్టెయినబుల్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్' అనే అంశంపై ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ నీటిమనిషి, జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఓయూతో తనకు నాలుగు దశాబ్దాలుగా అనుభవం ఉన్నదని గుర్తు చేశారు. అనేక ఉద్యమసమయాల్లో అనేక మంది ప్రముఖులతో ఈ గడ్డమీద పోరాడానని చెప్పారు. ప్రకతి అంటే చెట్లు, పుట్టలు, రాళ్లు, గుట్టలు, జంతువులు, పక్షులు అని, అవి అందరివీ అని అన్నారు. మనిషి లేనంతకాలం ఈ ప్రకతి, పర్యావరణం బాగానే ఉన్నాయన్నారు. ఎప్పుడైతే మనిషి ప్రకతి, అడవి జోలికి పోయాడో అప్పటి నుంచి అవి నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. మనిషికి, ప్రకతికి దూరం పెరుగుతూపోతోందన్నారు. మనిషి తన స్వార్థం కోసం నీరు, అడవులను అవసరానికి మించి వాడుతున్నారని ఆరోపించారు. దాంతో అవి అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వారి నివాస ప్రాంతాల్లో వాననీటి సంరక్షణ కోసం, తన చుట్టూ ఉన్న చెట్లు నరికివేయకుండా కాపాడుకోవాలని సూచించారు. అదనంగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. భూమి, ప్రకతి, పర్యావరణం, నీటిపై ప్రతి ఒక్కరికీ ఎలా హక్కు ఉందో, అదేవిధంగా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని స్పష్టం చేశారు. తాను చిన్నప్పటి నుంచి ఏ పళ్లు తిన్నా వాటి గింజలు దాచిపెట్టుకుని, వర్షాకాలంలో వాటిని భూమిలో పాతిపెట్టేవాడినని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. వీరయ్య, జాగ్రఫీ విభాగం హెడ్, ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొ. శ్రీనగేశ్, డా. సుదర్శన్, మహమ్మద్ అక్తర్ అలీ, డాక్టర్ శ్రీధర్, పావని, వీణ పీహెచ్డీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.