Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక కార్యక్రమాలు
నవతెలంగాణ-దుండిగల్/బాలానగర్
ఉద్యోగులు, కార్మికుల హక్కుల హక్కులకోసం, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకోసం ఈనెల 28,29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని సీఐటీయూ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ల ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని పోరాడి విజయం సాధించారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో కార్మికవర్గం పోరాడాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, సహజవనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలు అవలంభిస్తోందని చెప్పారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజ్ పేరుతో ధారాదత్తం చేస్తోందన్నారు. ప్రభుత్వరంగా ఆస్తులన్నింటినీ కార్పొరేట్లకు అమ్మే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. కాబట్టి 28, 29 తేదీల్లో జరిగేది దేశ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్మిక, కర్షక హక్కుల పరిరక్షణలతో కూడిన దేశభక్తియుత సమ్మె అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బాచుపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో యూనియన్ నాయకులు ఎన్.ఎ ఎల్లమ్మ, ఓబులేశు, శివ కుమార్, ఎన్.శ్రీనివాస్, బి.శ్రీనివాస్, హుస్సేన్ తది తరులు పాల్గొన్నారు.
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
మార్చి 28, 29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మెకు జిల్లా వ్యాప్తంగా కార్మిక లోకం సన్నద్ధమవుతోందని సీఐటీయూ బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులను సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం చేసేందుకు విస్తతంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. మంగళవారం సమ్మె వాల్‌పోస్టర్లను బాలానగర్ లేబర్ అడ్డావద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు సమావేశం నిర్వహించారు. సార్వత్రికలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగియగానే కేంద్రంలోని బీజేపీ వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసి ప్రజలను ఇబ్బందులపాలు చేస్తోందన్నారు. దేశ ప్రజల మీద ఉన్న దేశ భక్తి ఇదేనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు సుబ్బారావు, సంతోష్, మహేశ్, రాములు పాల్గొన్నారు.