Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీలతో రోడ్లపై పాదచారుల భద్రత కరువైంది. రోడ్డు దాటే క్రమంలో ప్రమాద సంఘటనలు జరుగుతున్నాయి. పలు ప్రమాదాల్లో మరణాలు సంభవించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో రోడ్డు దాటాలంటేనే భయపడే పరిస్థితులు కొన్నిచోట్ల నెలకొన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలాంటి పరిస్థితికి చెక్‌పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. పాదచారులకు భద్రత కల్పించడానికి ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీలో పలుచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు కూడా నిర్మించిన సంగతి తెలిసిందే.
రూ.32.75 కోట్లతో... ప్రజల అవసరాల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో ఫుట్‌పాత్‌లను నిర్మించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014-15 సంవత్సరం నాటికి 452 కిలోమీటర్ల పొడవున్న ఫుట్‌పాత్‌లు 2021 నాటికి 816.90 కిలో మీటర్లకు విస్తరించాయి. బాటసారులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు ఫుట్‌పాత్‌లను నిర్మించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.32.75 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి జోన్లో 10 కిలో మీటర్ల చొప్పున మొత్తం 75.64 కిలోమీటర్ల ఫుట్‌పాత్ నిర్మాణానికి 69 పనులు చేపట్టగా ఇప్పటి వరకు రూ.26.81కోట్ల వ్యయంతో 60 పనులతో 62.08 కిలోమీటర్ల పొడవు గల ఫుట్‌పాత్‌ను పూర్తి చేశారు. మిగతా రూ.5.94 కోట్ల విలువ గల 9 పనులు పురోగతిలో ఉన్నాయి. అదనంగా సీఆర్ఎంపీ ద్వారా నూతనంగా 60.94 కిలోమీటర్ల ఫుట్‌పాత్ చేపట్టడంతో పాటు 6.55 కిలోమీటర్ల ఫుట్‌పాత్‌కు మరమ్మతులు చేపట్టారు.