Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో సిలిండర్ భారం రూ.17.90 కోట్లకుపైనే
- 17లక్షల కుటుంబాలపై అదనపు భారం
- ఒక్కొక్క సాధారణ కనెక్షన్‌పై రూ.50 పెంపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కారు సామాన్యులకు భారీ షాకిచ్చింది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో విలవిలాడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు.. గ్యాస్ ధరల రూపంలో మరో భారం మోపి వారి నడి ్డవిరించింది. పెట్రోల్, డీజిల్ తరహాలో గ్యాస్ సిలిండర్ ధరలు దూసుకెళ్తూ.. వెయ్యి రూపాయల మార్క్ దాటేసింది. గడిచిన ఆరు నెలల్లోనే ఏకంగా మరో రూ.50లు పెరగడం సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల ఫలితాలు వచ్చేంత వరకు ఓపిక పట్టిన మోడీ సర్కారు గ్యాస్ ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మోపింది. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.50లు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలకు కోలుకోలేని దెబ్బకొట్టింది. ఫలితంగా ప్రస్తుతం రూ.952గా ఉన్న ఒక సిలిండర్ ధర రూ.1002కు చేరింది. ఈ ధరల పెంపుతో జిల్లాలో 17.87లక్షల కుటుంబాలపై సుమారు రూ.17.90 కోట్ల మేర భారం పడింది. ఇదే సమయంలో గ్యాస్‌పై ఇచ్చే రాయితీకి దశలవారీగా ప్రభుత్వం మంగళం చెబుతోంది. వెయ్యి చెల్లిస్తే.. కేవలం రూ.40మాత్రమే వినియోగ దారుల ఖాతాల్లో జమ చేస్తోంది. కొంతమందికి అదికూడా రావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గ్యాస్ ధరల పెంపుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు చిరువ్యాపారులు కూడా ముక్త కంఠంతో సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 67 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా.. వీటి పరిధిలో ప్రస్తుతం 17,87,026 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కనెక్షన్లు 16,06,397 ఉండగా.. ద్వీపం కనెక్షన్లు 1,59,024, ఉజ్వల కనెక్షన్లు 1288 ఉన్నాయని అధికారులు తెలిపారు. కాగా ఒక్కో కటుంబానికి ఏడాదిలో నెలకు ఒకటి చొప్పున మొత్తం 12 సిలిండర్లు రాయితీపై వినియోగించే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం పెరిగిన గ్యాస్ ధర రూ.50తో పోల్చి చూస్తే 17లక్షలకు పైగా కుటుంబాలు ఒక్కో సిలిండర్‌పై ఒక నెలకు సరాసరి రూ.17కోట్ల 90లక్షల 60వేల052 భారం పడతుంది. అయితే జిల్లాలోని పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చాలావరకు ఏడాదికి 6-8 సిలిండర్లు వరకే వినియోగించుకుంటున్నారని గ్యాస్ఎజేన్సీ నిర్వహకులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం జిల్లాలో 20,379వరకు వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.2195 ఉండగా.. రూ.2186కు దిగివచ్చింది. కమర్షియల్ గ్యాస్ ధర దిగి రావడంతో వ్యాపారులకు స్వల్ప ఊరట దొరికింది.
రూ.1002కు చేరిన గ్యాస్ ధర
హైదరాబాద్ జిల్లాలో నిన్నటివరకు సిలిండరు ధర రూ.952 ఉండగా.. ఇప్పుడు రూ.50లు పెరిగి ఆ ధర రూ.1002కు చేరుకుంది. సిలిండరు తీసుకునే వినియోగదారు గ్యాస్ కావాలంటే అప్పటికప్పుడు పెంచిన ధరను చెల్లించాల్సిందే. రాయితీని నగదు బదిలీ కింద వినియోగదారు బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నారు. అయితే గ్యాస్ రాయితీకి ప్రభుత్వం క్రమంగా మంగళం పాడుతోంది. వంటింటి గ్యాస్‌పై ఇచ్చే రాయితీని కుదించిన కేంద్రం... కొద్దినెలలుగా గృహావసరాల సిలిండర్లపై 40.71 పైసలు మాత్రమే ఖాతాల్లో జమచేస్తోంది. కొన్ని చోట్ల ఈ డబ్బులు కూడా రావడం లేదు. 2014లో సబ్సిడీయేతర గ్యాస్ ధర వెయ్యి రూపాయలుగా ఉంటే డీబీటీఎల్ 535 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమయ్యేవి. ఆ డబ్బులతో వినియోగదారుడు మరో సిలిండర్ కొనుగోలు చేసుకునేవాడు. కానీ ఏడేండ్లుగా రాయితీ మొత్తాన్ని తగ్గిస్తూ మోడీ ప్రభుత్వం కోట్లాది మంది డీబీటీ లబ్ధిదారుల నడ్డి విరుస్తోంది. ఓ వైపు రాయితీల్లో కోత... మరోవైపు పన్నులు, సుంకాల్లో వాత పెడుతూ పేద జనం బతుకులను ఆగం చేస్తోంది.
ఎల్పీజీ పాత ధర కొత్త ధర పెరిగింది
డొమొస్టిక్ రూ. 952 రూ.1002 రూ.50
వాణిజ్య పాత ధర కొత్త ధర తగ్గింది
వాణిజ్య రూ. 2195 రూ.2186 రూ.9
జిల్లాలో డొమెస్టిక్ కనెక్షన్లు ఇలా..
సాధారణ కనెక్షన్లు 16,06,397
దీపం కనెక్షన్లు 1,59,024
ఉజ్వల కనెక్షన్లు 1288
మొత్తం 17,87,026
ఇది మోసపూరిత చర్య
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. ఎన్నికల్లో లబ్ది కోసం ఇన్ని రోజులు ధరల జోలికి పోకుం డా ఎన్నికలు ముగిసిన వెంట నే పెంచడం ప్రజలను వంచించడమే. సామాన్య ప్రజలను ఆదుకోని బీజేపీ సర్కార్ బడాబాబులకు మాత్రం రూ.11లక్షల కోట్లు మాఫీ చేసింది. సామాన్య ప్రజలకు ఉన్న సబ్సిడీలను ఎత్తివేసి.. కొద్దిపాటి సౌకర్యాలు తొలగించి జనంపై భారం వేస్తోంది. సబ్కా సాత్.. సబ్కా వికాస్ అంటున్న కేంద్రం కేవలం కార్పొరేట్ల సాత్.. కార్పొరేట్ల వికాస్ తప్ప పేదలకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ మోసపూరిత చర్యలపై ప్రజలు ఆలోచన చేయాలి.
- ఎం.శ్రీనివాస్, సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి