Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, మోడీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు
- నిరసల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు
- వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్
నవతెలంగాణ-కూకట్పల్లి/కంటోన్మెంట్/బంజారాహిల్స్
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలపెంపుదలపై నిరసనలు వెల్లువెత్తాయి. గురువారం నగరవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధరల పెంపుదలకు, కేంద్రంలోని బీజేపీ వైఖరికి నిరసనగా ధర్నాలు, ర్యాలీలు, వంటా వార్పు, మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయాచోట్ల కార్యకర్తలు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. బీజేపీ హటావో.. దేశ్‌కో బచావో అంటూ నినదించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్రానికి బుద్ధి చెప్పాలని, బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చివేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆయాచోట్ల జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఆరెకపూడిగాంధీ, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో...
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల పిలుపు మేరకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్‌గౌడ్, రోజాదేవి రంగారావు, నార్నే శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఉషా ముళ్ళపూడి కమాన్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డు మీద కట్టెల పొయ్యి పెట్టి అందరికీ చారు కాచి అందించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మోడీ డౌన్‌డౌన్ నినాదాలతో హోరెత్తిం చారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకష్ణగౌడ్, సమ్మారెడ్డి, జిల్లా గణేశ్, చిన్నోళ్ల శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్, గుడ్ల శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, మంజుల, శివరాజ్‌గౌడ్, పోశెట్టిగౌడ్, షౌకత్ అలీ మున్నా, బోయాకిషన్, యాదగిరి, ప్రదీపరెడ్డి, అగ్రవాసు, రహమాన్, రాములుగౌడ్, ఖైసర్, లక్ష్మమ్మ, స్వప్న, దేవి, రేణుక, ప్రీతి, నస్రీన్, రాజమనిగౌడ్, వెంకటకష్ణ, లలన్, సంగమేశ్, వెంకటేశ్, కటికరవి, దేవేందర్, సాయిగౌడ్, దుర్గేశ్, కుర్మయ్య, ఖాజామియా, ఫజల్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
జేబీఎస్ వద్ద ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో ధర్నా
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అధ్వర్యంలో జేబీఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మెన్ గజ్జల నాగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అడ్డగోలుగా రేట్లు పెంచితే గరీబోళ్లు గంగలో దూకాల్నా : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచుతూ పోతే గరోబోళ్లు ఎట్లా బతకాలె? గంగలో దూకాల్నా ? అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేద్రం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. గురువారం జూబ్లీహిల్స్, ఫిలింనగర్ల పరిధిలోని కార్పొరేటర్లతో కలిసి సిలిండర్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరంగా ఎఫ్‌సీఐ ధాన్యం కొనాల్సి ఉన్నప్పటికీ, కొనుగోలు చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ప్రజా సమస్యలు, సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలి మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న మోదీ సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్, వెంకటేశ్వర డివిజన్ కార్పొరేటర్ కవితరెడ్డి, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
బోయిన్పల్లి డివిజన్లో...
బోయిన్పల్లి డివిజన్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కార్యకర్తలతో కలిసి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుదలపై నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాలు చూస్తుంటే సామాన్యులు, పేదలు ఎలా బతుకుతారో అర్థం కావడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అస్తవ్యస్థ విధానాలతో దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు బతుకు బండిని నెట్టుకురావడం కష్టంగా మారిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుని, ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
కాప్రాలో...
వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో పెనుభారం పడుతోందని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. ధరల పెంపుదలకు నిరసనగా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్లో ఆమె ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బొంతు శ్రీదేవి మాట్లాడుతూ.. ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.