Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్
- ఈనెల 28, 29 తేదీల్లో సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపు
- పలుచోట్ల సమ్మె సన్నాహక సమావేశాలు, పోస్టర్లు విడుదల
నవతెలంగాణ-మల్కాజిగిరి/ముషీరాబాద్/దుండిగల్
జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే. వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని పలు ఏరియాలలో సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. జె. వెంకటేశ్ హాజరై మాట్లాడుతూ... ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ కార్మికులందరికీ కార్మికులందరికీ డబల్ బెడ్రూమ్ర ఇండ్లు కేటాయించాలని, ఏపీలో ఇస్తున్నట్టు మాదిరి, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానానికి వ్యతిరేకంగా కార్మికులందరూ సమ్మెలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు ఉన్ని కృష్ణ, కే. నాగరాజ్, పి. కిషోర్, మల్కాజిగిరి సర్కిల్ జీహెచ్ఎంసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో...
ఈ నెల 28, 29 తేదీలలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ కోరారు. ఆ సంఘం ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సమ్మె సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జె. వెంకటేష్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం బరితెగించి పరిపాలన చేస్తోందన్నారు. మాటల్లో జాతీయత దేశభక్తి, ఆచరణలో దేశ విధ్వంసకర విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. జాతీయ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలు కారుచౌకగా స్వదేశీ, విదేశీ ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నదని, కరోనా సమయంలో సామాన్య ప్రజలను ఆదుకోకపోగా వారిపై మరిన్ని భారాలు మోపుతోందన్నారు. ప్రజల జీవన ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. సంపద సృష్టికర్తలైన కార్మికుల కర్షకులకు నష్టం వాటిల్లే విధంగా నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని, కార్మిక ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ రాజ్యాంగబద్ధంగా హక్కులను కాలరాస్తోందని అన్నారు. ఉపాధి కల్పన, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలు పట్టించుకోకపోగా, మరింత తీవ్ర రూపం దాల్చే విధానాలు అవలంభిస్తోందని చెప్పారు. ప్రజలను కాపాడండి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో జరుగుతున్న దేశభక్తి యుత సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులందరూ ఐక్యంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా నగర కార్యదర్శి ఆర్.వాణి, లక్ష్మీబాయి, సత్యమ్మ, రేణుక, లత, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ విడుదల
సార్వత్రిక సమ్మె పోస్టర్ను గురువారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్(సీఐటీయూ) నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సమ్మె పోస్టర్ విడుదల చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సమ్మెలో అందరూ పాల్గొనాలని కోరారు. కేంద్రం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తోందని, ధరల పెంపుదలతో పేదలపై భారాలు మోపుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ సమ్మె ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి, ప్రమాదకరమైన లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందన్నారు. వీటివల్ల కార్మికులకు పనిని 8 నుంచి 12 గంటలకు పెంచుతారని, పని భద్రత, సామాజిక భద్రత లేకుండా పోతుందని తెలిపారు. కార్మికులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఫిక్స్డ్ పే, ట్రైనింగ్, అప్రెంటిస్ పేర్లతో పని చేయవలసిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు ఊసే ఉండదని చెప్పారు. సంఘటిత అసంఘటిత కార్మికులు నూటికి 95 మంది ఏ చట్టాలు అమలు లేని భద్రత లేని పరిస్థితుల్లోకి నెట్టబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను మోసం చేస్తూ బారిపై భారాలు మోపుతూ.. పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ప్రజల, కార్మికుల శక్తిని అప్పనంగా ధారపోస్తోందన్నారు. కార్మికులను బానిసలుగా చేసే దానికోసం ఇదంతా చేస్తోందన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్, ఔజక్ష సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అందాక కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. ఈ మున్సిపల్ యూనియన్ ఉపాధ్యక్షులు పి. పెంటయ్య, సీఐటీయూ మండల నాయకులు పి.స్వామి, కార్మికులు మణి, లక్ష్మి, లింగమ్మ, సత్యనారాయణ నరసింహా, రమేశ్, చెన్నయ్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.