Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
నవతెలంగాణ-అడిక్‌మెట్
గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పదిశాతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని, మాజీ ఎమ్మెల్సీ, ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్. రాములు నాయక్ హెచ్చరించారు. రిజర్వేషన్లు అమలు చేయకపోతే మంత్రులను, ఎమ్మెల్యేలతోపాటు ప్రధానంగా గిరిజన ప్రజాప్రతినిధుల ఇండ్లను తండాల్లోకి రాకుండా అడ్డుకుంటామన్నారు. ఆదివారం ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి (టీఆర్పీఎస్) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో గిరిజన జనాభా దామాషా ప్రకారం ఆరు శాతం నుంచి పదిశాతానికి రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లపై అనేక మార్లు అడిగిన సందర్భంలో యాభై శాతం రిజర్వేషన్ దాటితే సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని అందుకు తానే గిరిజన హక్కుల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి హక్కులు సాధిస్తానని, చల్లప్ప కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని అడిగిన నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీనుంచి నన్ను బయటకు పంపించడం జరిగిందని తెలిపారు. గిరిజన రిజర్వేషన్ కోసం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నరుకు వినతి పత్రాలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ ఈ విషయాన్ని సుమోటాగా తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. గిరిజన రిజర్వేషన్‌కు మద్దతు ఇచ్చే కుల సంఘాలకు తమ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో కేసీఆర్ తరిమికొట్టడం ఖాయమని అన్నారు. మాజీ ఎంపీ రవీంద్రనాయక్ మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామాకాల కోసం తెలంగాణ బిడ్డలు తొలి దశ, మలిదశ ఉద్యమంలో 1569 మంది ప్రాణాలు త్యాగం చేసే నే రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచలోనే అత్యంత అవినీతి పరుడు సీఎం కేసీఆర్ అని మండి పడ్డారు. అన్ని కులాలకు పంగనామాలు పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్యాబినెట్లో నిర్ణయం చేసి గిరిజన రిజర్వేషన్ ను పది శాతానికి పెంచవచ్చాన్నారు. ఈ నిరసన దీక్షలో వివిధ గిరిజన సంఘాల నాయకులు సిద్ధార్ధనాయక్, నిర్మల్ రాజునాయక్, శ్రీను. శంకర్ నాయక్ , వెంకట్ బంజారా, అశోక్, రమేషాథోడ్, గోపిచంద్, శరత్‌తో పాటు ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.