Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రజా కళాకారులు ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతం చేసి మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాల్ రాజ్ సూచించారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో తెలంగాణ కళాకారుల సమాఖ్య ఆవిర్భావ సభ కార్యక్రమాన్ని డాక్టర్ చిలుక భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్.బాల్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఉద్యమ కళాకారులు కాళ్లకు గజ్జలు కట్టి గంతులేసి గలమెత్తి పాడిన కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేసి ధూమ్ దాం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ కళాకారుల సమాఖ్య తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్రను పోషించాలని సూచించారు. తెలంగాణ సాధనలో పాల్గొన్న కళాకారులను ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించాలని, అమరులైన కుటుంబాలకు పెన్షన్ చెల్లించాలని, అర్హులైన కళాకారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కళాకారులు తమ కలల ద్వారా నోటుకు ఓటు కొనే పరిస్థితి రాకుండా చైతన్యవంతం చేయాలని సూచించారు. అనంతరం కళాకారుల సమాఖ్య రాష్ట్ర నాయకులు డాక్టర్ చిలుక భాస్కర్ మాట్లాడుతూ తమ కళాకారుల సమాఖ్య రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర నాయకులు జిలుకర రవికుమార్, ఉప్పుగల సోమయ్య, చిలుక మల్లేశం, డాక్టర్ సలీం, బాషా, పాక నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు.