Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేగంపేట సర్కిల్లో విచ్చలవిడి కట్టడాలు
- మామూళ్ల మత్తులో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది
- ఫిర్యాదు చేసినా పట్టింపులేని వైనం
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్ జోన్ బేగంపేట సర్కిల్ పరిధిలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ముఖ్యంగా మోండా డివిజన్ పరిధిలో మున్సిపాల్టీ లేకుండా భారీ అక్రమ భవంతుల నిర్మాణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెరుమాళ్ టెంపుల్ సమీపంలో అక్రమంగా భారీ భవంతి నిర్మాణమవుతుంది. ముత్యాలమ్మ ఆలయం వీధిలో అనుమతులకు మించి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. మోండా డివిజన్లో అమాత్యుల అండదండలతో అక్రమ నిర్మాణాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతున్నాయి. అధికారులు తమకు మామూళ్లు అందడంతో అక్రమ కట్టడాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఏసీపీ, సెక్షన్ ఆపిసర్లు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూలుతూ అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా మున్సిపల్ అధికారులు, సిబ్బంది తీరుతో ఆచరణలో సాధ్యం కావడం లేదు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కండ్ల ముందు పేకమేడల్లా అనుమతుల్లేని బహుళ అంతస్థులు వెలుస్తున్నా తమకేమీ పట్టనట్టుగా బేగంపేట టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఇరుగుపొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేస్తే ముందుగానే ఆయా భవన నిర్మాణ యజమానులకు కుమ్ముక్కయిన సిబ్బంది ఏవిధంగా నిబంధనలు అతిక్రమించాలో భవన యజమానులకు నేర్పుతున్నారు. ఇలా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ (బల్దియా) ఖజానాకు గండి కొడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న నిర్మాణాలు ప్రభుత్వ అధికారులకు తెలియకపోవడం ఒక కారణమైతే కింది స్థాయి సిబ్బంది స్థానిక నాయకులతో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం మరో కారణం. ఇప్పటికైనా బేగంపేట సర్కిల్ ఉన్నతాధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని, మునుముందు ఇలా జరగకుండా అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.