Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహిత్య అకాడమీ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలు
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ సంస్కృతి, కళలు, సాహిత్యాన్ని ఈతరం విద్యార్థులందరికీ తెలియజేయటానికి 'పునాస' సాహిత్య ప్రతికను ప్రతి పాఠశాలకు అందజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మంత్రి తన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో వెలువరిచిన మహిళల ప్రత్యేక సంచిక 'పునాస'ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక స్పృహ కలిగించేందుకు సాహిత్యం బలమైన సాధమని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యయులకు సాహిత్య అధ్యయనం చేసేందుకు ప్రతి పాఠాశాలలో సాహిత్య పత్రిక ఉండాలన్నారు. పాఠశాల విద్యాశాఖ, సాహిత్య అకాడమీల ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 'మన ఊరు మన చెట్లు' కథల పోటీకి అనూహ్య స్పందన వచ్చిందని వివరించారు. భవిష్యత్తులో సాహిత్య అకాడమీ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించాలన్నారు. అందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రణాళికలు తయారు చేస్తామని తెలిపారు. 'పునాస' పత్రికను ప్రతీ స్కూలుకు వెళ్లేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 'పునాస' పత్రికను పంపేందుకు ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. తెలంగాణ సాహిత్యాన్ని గడపగడప దాకా తీసుకుని పోవాలన్న తమ ప్రయత్నానికి మంత్రి ఎంతో ప్రోత్సాహాన్ని అందించిందన్నారు.