Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కదం తొక్కిన కార్మికలోకం
- దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పారిశ్రామిక వాడల బంద్, భారీ ప్రదర్శనలు, ధర్నాలు
- కేంద్రం అవలంభిస్తున్న విధ్వంసకర విధానలు ఉపసంహరించుకోవాలని డిమాండ్
రోజూ సందడిగా కనిపించే పారిశ్రామికవాడలు సోమవారం మూగబోయాయి. పనిలో నిమగమైపోయే కార్మికలోకం ఎర్రజెండాలు చేతబట్టుకొని రోడ్డెక్కింది. వందలు, వేలుగా కార్మికులంతా తరలివచ్చారు. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. కార్పొరేట్లకు మేలు చేస్తూ సామాన్య ప్రజలకు నష్టం చేసే విధ్వంసకర విధానాలు వెనక్కి తీసుకోవాలని నినదించారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మడం మానుకోవాలని, కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చవద్దని డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఆల్‌ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో పలుచోట్ల కార్మికులు ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. చర్లపల్లి, జీడిమెట్ల, ఉప్పల్, బాలానగర్, నాచారం తదిర పారిశ్రామికవాడల్లో సమ్మె ప్రభావం బాగా కనిపించింది.
నవతెలంగాణ-కాప్రా/జగద్గిరిగుట్ట/కుత్బుల్లాపూర్/బాలానగర్/తుర్కయంజాల్/కాప్రా
జీడిమెట్ల పారశ్రామికవాడలో
ప్రజా వ్యతిరేక విధానాలతో పాలించే బీజేపీ ప్రభుత్వం మనుగడ సాధించలేదని. దేశంలో మోడీ పాలన అత్యంత దుర్మార్గం గా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సబ్‌స్టేషన్ నుంచి పారిశ్రామిక వాడలో బంద్, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎసకేవీ నాయకులు కె.పి.వివేకానంద్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి.యూసుఫ్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి వి.ప్రవీణ్, ఐఎన్‌టీయూపీ జిల్లా అధ్యక్షులు గూడ ఐలయ్యలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. కార్మికులను రోడ్డు మీద పడేసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాల న్నారు. దేశంలో యువత నిరుద్యోగంతో విలవిలలాడుతున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలు ఎల్ఐసీ. రైల్వే రక్షణ రంగం, బోగ్గు గనులను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుందా మన్నారు. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందన్నారు.
చర్లపల్లి పారిశ్రామికవాడలో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది. సీఐటీయూ, సీఐటీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
జె. చంద్రశేఖర్, చర్లపల్లి ఇండిస్టీయల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బీవీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసులు శాధికారి ఎం.శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకులు శంకర్రావు, టీఎన్టీయూసీ నాయకులు ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మలక్‌పేట్ గంజ్‌లో...
కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. సోమవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మలక్‌పేట్ గంజ్ నుంచి డిమార్ట్ వరకు నిర్వహించిన ప్రదర్శన, సమ్మె కార్యక్రమాలకు ఆయన హాజరై మాట్లాడుతూ... నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం బరితెగించి పాలన చేస్తోందన్నారు. మాటల్లో జాతీయత దేశభక్తి గురించి కబుర్లు చెబుతూ ఆచరణలో దేశ విధ్వంసకర విధానాలను అమలు చేస్తోందన్నారు. జాతీయ సహజ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మివేస్తోం దన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిందని, ఉపాధి దెబ్బతిని అవస్థలు పడుతున్నారని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500 కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల శ్రావణ్ కుమార్, నగర నాయకులు బాలు, స్వరూప, నరసింహ, వీరభద్రాచారి, వెంకటేశ్, సయ్యద్, పాల్గొన్నారు.
బాలానగర్ పారిశ్రామిక వాడలో
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ పారిశ్రామిక వాడలో ఆయా కంపెనీల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. టెక్నో క్రాట్స్ ఆంధ్రా బ్యాంక్ దగ్గర నుంచి ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ బాలానగర్ పారిశ్రామిక ప్రాంత కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఏసు రత్నం, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మల్లన్న, కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి, పుష్పారెడ్డి, బాలానగర్ అధ్యక్షుడు ప్రసన్నకుమార్, మహేశ్, నవీన్, సీఐటీయూ నాయకులు వనిత, లక్ష్మి, అరుణ్, శ్రీకాంత్, సుభద్ర, సీపీఐ(ఎం) నాయకులు జగన్, శివ, ఆంజనేయులు, సుగుణ, నర్సమ్మ, ఏఐటీయూసీ కూకట్పల్లి కార్యదర్శి కష్ణ, రాజు, గద్ద శ్రీనివాసులు, లింగం, శ్రీను వివిధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు
తుర్కయంజాల్‌లో భారీ ర్యాలీ
తుర్కయంజాల్ మున్సిపల్ పట్టణ చౌరస్తాలో సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కార్మిక చట్టాలను, హక్కులను రక్షించుకుంటామంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. నాగార్జునసాగర్ హైవేపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ జరిగింది. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాడిగల్ల భాస్కర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓరుగంటి యాదయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదరిర్శవర్గ సభ్యులు, మంచాల మాజీ జడ్పీటీసీ పగడాల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాటల్లో జాతీయత దేశభక్తి గురించి కబుర్లు చెబుతూ.. ఆచరణలో దేశ విధ్వంసకర విధానాలను అమలు చేస్తున్నదన్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు బి.శంకరయ్య, బి.మాల్యాద్రి, ఎం.జె. ప్రకాశ్ కారత్, ఎం.సంజీవ, కె.సత్యం, ఎం.దాసు, నగేష్, రామకృష్ణ, గువ్వల రాజు, భరత్ బాబు, సుందరమ్మ, జనార్ధన్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు పి.శివకుమార్, ఎం.స్టాలిన్, శివ, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.