Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ ముషీరాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో సోమవారం నిరసన ధర్నా చేపట్టారు. నియోజకవర్గ అధ్యక్షులు కేఎల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర నాయకులు పిట్ల బాల్ రాజ్ హాజరై మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక వైపు తగ్గుతున్నప్పటికీ, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి నెల రోజులకు ఒకసారి పెంచడాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక భారంతో వాహనాలను బయటకు తీయాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన ప్రభుత్వం ఇటీవల యూపీతో సహా మిగతా 5 రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి కాగానే మళ్లీ ధరలు పెంచడాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు నిరసించాలని పిలుపునిచ్చారు. వీటితో పాటు వంట గ్యాస్ ధరలను పెద్ద ఎత్తున పెంచడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యక్రమంలో బీఎస్పీ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్డీ శ్యామ్సన్, జిల్లా ఇన్చార్జ్ అబ్రార్ హుస్సేన్ ఆజాద్, ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎజాజ్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కడారి ప్రవీణ, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తగరం అనిల్‌కుమార్, కార్యదర్శి రహీం, నాసీర్, రాంనగర్ డివిజన్ అధ్యక్షులు విశ్వనాథ్, చైతన్య, సంధ్యారాణి, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.