Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధర్యంలో ర్యాలీలు
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, గాంధీ ఆస్పత్రి వద్ద ధర్నాలు, నిరసనలు
- సమ్మెకు మద్దతుగా వామపక్షాల ర్యాలీలు
- నేడు కూడా కొనసాగనున్న సార్వత్రిక సమ్మె
గ్రేటర్ హైదరాబాద్‌లో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కార్మికులు, ఉద్యోగులు విధులు బహిష్కరించి పెద్దఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా జీడిమెట్ల, సనత్‌నగర్, ఉప్పల్, రామంతాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, రాజేంద్రనగర్, కాటేదాన్ పారిశ్రామికవాడల్లోని కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీంతోపాటు బస్సులు, ఆటోలు, పలు రవాణా సౌకర్యాలు సైతం బంద్ అయ్యాయి. భవన నిర్మాణ కార్మికులు గ్రేటర్‌లోని అన్ని అడ్డాల్లోనూ సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసీ, జీఐసీ ఉద్యోగులు తమ కార్యాలయాల్లోనే మధ్యాహ్న భోజన సమయంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఐక్య కార్మిక సంఘాల హైదరాబాద్ నగర కమిటీల ఆధ్వర్యంలో రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాలయం (సెంట్రల్) విద్యానగర్ వద్ద ధర్నా నిర్వహించారు. సమ్మెకు మద్దతుగా వామపక్షాల నగర కమిటీల ఆధ్వర్యంలో నారాయణగూడ నుంచి కాచిగూడ ఎక్స్‌రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు రెండో రోజూ సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
నవతెలంగాణ,సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ వద్ద ధర్నా..
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ.. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చడం, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో ప్రభుత్వ సంస్థలను అమ్మివేసి ఆరు లక్షల కోట్ల రూపాయలను సమీకరణ చేసుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌శక్తులకు అప్పగించడం వంటి విధ్వంసకర విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరుగుతుందని, ఇటువంటి విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు.
హెచ్ఎంఎస్ నాయకులు రెబ్బ రామారావు మాట్లాడుతూ... స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఆదాయపు పన్ను పరిధిలోకిరాని పేద కుటుంబాలకు నెలకు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని రక్షించాలని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎల్ఐసీ, జీఐసీ ఉద్యోగులు
రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో సాధారణ బీమా ఉద్యోగులు పాల్గొన్నారు. 56 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ వెంటనే సెటిల్ చేయాలని, ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటీకరణ చేసే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఏఐఐఈఏ, జీఐఈఏఐఏ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. 56 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి గాని, జీఐపీఎస్‌ఏ యాజమాన్యం నుంచి గాని వేతన సవరణపై ఎటువంటి స్పందనా లేదన్నారు. ఈ మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్ అండ్ యునైటెడ్ ఇండియా కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వేతన సవరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. జంటనగరాలలో ఉద్యోగులు యునైటెడ్ ఇండియా రీజనల్ ఆఫీస్, బషీర్బాగ్వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వేతన సవరణ వెంటనే చేపట్టాలని, ఎన్పీఎస్ రద్దు చేసి ఉద్యోగులందరినీ 1995 పెన్షన్ స్కీమ్‌లోకి తీసుకురావాలని, 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్ అప్డేషన్ కల్పించాలని, రిక్రూట్మెంట్ చేపట్టాలని నినదించారు. కేంద్ర ప్రభుత్వం సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రదర్శనను ఉద్దేశించి సీఐటీయూ కార్యదర్శి జె.వెంకటేశ్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు కేవీవీఎస్‌ఎన్ రాజు, హెచ్ఆర్జీఐఈఏ ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు, జీఐఈఏఐఏ హైదరాబాద్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్, జీఐపీఏ పెన్షనర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.
గాంధీ ఆస్పత్రిలో
గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్‌కేర్, సెక్యూరిటీ సిబ్బంది వేతనాలు వెంటనే పెంచాలి, కొత్త టెండర్లను పిలవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)నగర అధ్యక్షులు కుమారస్వామి డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గాంధీ హాస్పిటల్లో శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) నగర అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ.. గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ గడువు తేదీ జనవరితో ముగిసిన నేపథ్యంలో వెంటనే కొత్త టెండర్లు పిలవాలని కోరారు. కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు పెంచుతామని మంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకు వస్తుందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానంగా మార్చడం కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా మార్చడమేనని చెప్పారు. ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలంలో ధరలను తగ్గించకపోగా, విపరీతంగా పెంచిందన్నారు. అదే సమయంలో కార్మికుల వేతనాల్లో పెరుగుదల లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్త సమ్మె, పోరాటాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ హాస్పిటల్ కార్మిక యూనియన్ (సీఐటీయూ) వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వాణి, ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, యూనియన్ నాయకులు వెంకటేశ్, కార్తీక్, రమా తదితరులు పాల్గొన్నారు.