Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ప్రభుత్వరంగ సాధారణ బీమా ఉద్యోగులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రెండో రోజు సమ్మె విజయవంతమైంది. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఇఏ) ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో సాధారణ బీమా ఉద్యోగులు పాల్గొన్నారు. 56 నెలల నుండి పెండింగ్‌లో వున్న వేతన సవరణ వెంటనే సెటిల్ చేయాలని, ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలను ప్రైవేటీకరణ చేసే చర్యలను విరమించు కోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి గాని జీఐపీఎస్‌ఏ యాజమాన్యం నుండి గాని వేతన సవరణపై ఎటువంటి స్పందన లేదని ఉద్యోగు లు మండిపడ్డారు. మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్ మరియు యునైటెడ్ ఇండియా కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు వేతన సవరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. జంటనగరాలలో ఉద్యోగులు యునైటెడ్ ఇండియా రీజనల్ ఆఫీస్, బషీర్‌బాగ్ వద్ద సమ్మె నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వేతన సవరణ వెంటనే చేపట్టాలని, ఎన్పీఎస్ రద్దు చేసి ఉద్యోగులందరినీ 1995 పెన్షన్ స్కీమ్‌లోకి తీసుకు రావాలని, 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్ అప్డేషన్ కల్పించాలని, రిక్రూట్మెంట్ చేపట్టా లని నినాదాలు చేశారు. నాలుగు కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శన లో పాల్గొన్నారు. హెచ్ఆర్జీఐఇఏ అధ్యక్షులు ఎ. నారాయణరావు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐఐఇఏ ఉపాధ్యక్షులు కేవీవీ ఎస్ఎన్ రాజు, హెచ్ఆర్జీఐఇఏ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, జీఐపీఏ పెన్షనర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, బీవీకేఎస్ ప్రధాన కార్యదర్శి ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, ఎన్ఐసీఓఏ అధ్యక్షులు టి.రవీందర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సాధారణ బీమా కంపెనీలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకుని బలోపేతం చేయడానికి నాలుగు కంపెనీలను విలీనం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే మన వేతన సవరణ సాధించుకోగలం మరియు మన కంపెనీలను ప్రైవేటీకరణ కాకుండా చూడగలం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటికైనా మొండివైఖరి విడనాడి ఉద్యోగ సంఘాలతో చర్చించి వేతన సవరణ సెటిల్ చేయాలని కోరారు, లేనిచో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.