Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను బడా బాబుల కు దోచిపెడుతూ కార్మికుల బతుకులను బానిసలుగా చేస్తున్నారని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీన్ యూనియన్ నాయకులు అన్నారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, పీడీత పేద బడుగు వర్గాల అభ్యున్నతికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైకరికి వ్యతిరేకంగా పిలుపు నిచ్చిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, ఎస్టీడీసీ అండ్ టీటీసీ బ్రాంచ్ సభ్యులు రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బ్రాంచ్ అధ్యక్షులు, రాష్ట్రశాఖ కోశాధికారి శాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశ సంపదంతా బడా బాబులకు దోచిపెడుతూ పోట్ట కూటికి అలమటిస్తు న్న పేదలపై, నిత్యావసర సరుకుల ధరలు పెంచి బుక్కెడు కూటికి దూరం చేస్తున్నారన్నారు. కార్మికుల, ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ వారిని బానిసలు గా మార్చారన్నారు. రవికుమార్ మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెకు దారితీసిన అంశాలను ధర్నా లో పాల్గొన్న సభ్యులకు వివరించారు. కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన 4 కోడ్లను రద్దు చేయాలనీ, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలనీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తూ వారి సర్వీస్లను క్రమబద్దీకరించడం వంటి సమస్యలను దాటవేయడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్పొరేట్ వ్యవస్థకు పెద్ద పీట వేయడంతో కార్మికులు తమ హక్కులను కోల్పోయి బానిస బతుకులు బతుకున్నారని చెప్పారు. ఎన్నికల వరకు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎంతో ఓర్పుతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఫలితాలు రాగానే రోజుకు రూ.1,2 వరకు పెంచుతూ వాహనదారుల నడ్డి విరుస్తుందన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలే నేటి ఈ సార్వత్రక సమ్మెకు కారణమనీ, ఈ రెండు రోజులపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులతోపాటు కర్షకులు, పీడిత పేద బడుగు వర్గాల ప్రజలు సమ్మెలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారని తెలిపారు. ఈ సమ్మెలో సలాం, లక్ష్మినారాయణ, మహబుబ్ అలీ, యాసీన్, సుధాకర్, అలీం, శ్రావన్, అనురాధ, అక్బరీబేగం, జ్ఞానేశ్వరీ, తదితరులు పాల్గొన్నారు.