Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న చిన్న సందుల్లోనూ నాలుగంతస్తుల బిల్డింగులు
- ప్రత్యక్షంగా, పరోక్షంగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్న కొందరు అధికారులు, నేతలు
- కూకట్పల్లి సర్కిల్ వ్యాప్తంగా ఇదే తంతు
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. చిన్న చిన్న సందుల్లో కూడా నాలుగైదు అంతస్తుల బిల్డింగులు కడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాటించాల్సిన నిర్మాణపరమైన నిబంధనలు గాని, సేఫ్టీ రూల్స్ గాని చాలామంది పట్టించుకోవడం లేదు. కొందరైతే పర్మిషన్ ఒకలా తీసుకొని, నిర్మాణం మరోలా చేపడుతున్నారు. పేదలు, మధ్య తరగతివారు ఇల్లుకట్టుకోవడానికి సలవాలక్ష నిబంధనల పేరుతో ఇబ్బందుపాలు చేసే టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం, కొందరు అక్రమార్కులు ఇష్టారీతిన కడుతున్న అక్రమ నిర్మాణాలవైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా పరక్షంగా అక్రమ నిర్మాణ దారులకే సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారా? అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారా? అని పలువురు స్థానికులు కూకట్పల్లి టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. 'అక్రమ నిర్మాణాలు అడ్డుకోరు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే 'ఫలానా బిల్డర్‌కు అధికారపార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల మద్దతు ఉంది. కాబట్టి ఏమీ చేయలేం'' అన్న సమాధానలు షరా మామూలై పోయాయని వాపోతున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు పనితీరు సక్రమంగా లేదని, అక్రమ కట్టడాలను, నిర్మాణాలను అడ్డుకోవడం లేదని కూకట్పల్లి సర్కిల్ ప్రజలు తరచూ ఫిర్యాదులు చేస్తున్నా, ఆరోపిస్తున్నా, ఆవేదన వ్యక్తం చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
అక్రమాలు ఇలా...
-ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సెకండ్ ఫేజ్‌లో కాలనీ రహదారికి ఆనుకుని ఏకంగా నాలుగంతుస్తుల అక్రమ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణానికి ముందు రోడ్డు పది అడుగులు కూడా ఉండదు. అయినా అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో యథేచ్ఛగా నిర్మాణం కొనసాగుతోంది. పనులు పూర్తవకుండానే అక్రమార్కులకు అండగా నిలిచిన అధికారుల సలహా మేరకు బయట రంగులు పూసి అక్రమాన్ని సక్రమం చేసే ప్రయత్నం శతవిధాలా చేస్తున్నారు.
-ఆల్విన్ కాలనీలోని రహదారిలోనే జలకన్య హౌటల్ సమీపంలో ఓ వ్యక్తికి సంబంధించిన అక్రమనిర్మాణానికి కూడా అధికారులు అండదండలేగాక, ప్రజా ప్రతినిధుల సహకారం కూడా ఫుల్లుగా ఉందన్న చర్చ జరుగుతోంది. వెనుక అధికారులు, ప్రజా ప్రతినిధుల సపోర్టు ఉంటే చాలు... అది ఇరుకు రోడ్డయినా, ప్రజలకు ఇబ్బందులెదురైనా అడ్డుగోలుగా నిర్మాణం చేపట్టవచ్చా? అన్న సందేహాలకు సమాధానం కరువవుతోంది.
-ఎల్లమ్మ బండ లాంటి స్లమ్ ఏరియాల్లో 80 గజాల స్థలంలోనే కొందరు నాలుగంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే అక్రమ నిర్మాణ దారులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానూ సహాయపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడంలో కూకట్పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల విఫలం అవుతున్నారని విమర్శిస్తున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.