Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు, పెన్షన్లకే 92.66 శాతం నిధులు
- రూ. 65 కోట్లు పెంచినా ప్రయోజనం శూన్యం
- వేతనాలపెంపుతో లోటు రూ. 37 కోట్లా 32 లక్షలు
- సెంటినరి పైలాన్, అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మాణం
- ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను బుధవారం నిర్వహించిన అకాడమీ సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. రూ.37.56 కోట్ల లోటుతో బడ్జెట్ ఆమోదించారు. ఓయూ బడ్జెట్ మొత్తం ఆదాయం రూ. 682.22 కోట్లు చూపెట్టగా, వ్యయం రూ.746.32 కోట్లుగా చూపెట్టారు. ఇందులో ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్స్ రూ.418.06 కోట్లు, మిగిలిన నిధులను యూనివర్సిటీ అంతర్గ తంగా సమకూర్చుకోనుంది. ఓయూ అడ్మినిస్ట్రేషన్ భవన్లోని అకాడమిక్ సెనేట్ హాల్లో జరిగిన సమావేశంలో ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్ వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన సెమినార్లు, సదస్సులు తదితర అంశాలను వివరించారు. యూనివర్సిటీ నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్టుల గురించి చెప్పారు. అనంతరం ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, కామర్స్ విభాగం ప్రొ.వి. అప్పారావు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఓయూకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రూ.418.06 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరుకాగా, గతేడాది ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ.26.54 కోట్లు, వివిధ గ్రాంట్ల రూపేణా ప్రభుత్వం నుంచి రూ. 55.00 కోట్లు మంజూరయ్యాయి. మిగిలిన మొత్తం వర్సిటీ భరించాల్సి ఉంటుంది. ఇందులో రూ.33.94 కోట్లు అంతర్గత ఆదాయాల ద్వారా, ఎగ్జామినేషన్ బ్రాంచ్, యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్, దూరవిద్య కేంద్రం, డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్, డైరెక్టరేట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ సెల్ తదితర సంస్థల నుంచి వస్తోంది. నిధుల మళ్లింపు ద్వారా రూ.144.52 కోట్లు, పెన్షన్ కార్పస్ ఫండ్ వడ్డీ ద్వారా రూ.28 కోట్లు, లోన్లు, అడ్వాన్సుల వసూళ్ల ద్వారా రూ.2.70 కోట్లు సమకూర్చుకుంటామని వీసీ పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్లో లెక్చరర్లు, ఉద్యోగుల వేతనాలకు రూ.406.53 కోట్లు కాగా, పెన్షన్లకు రూ.285.00 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆకస్మిక అవసరాలకు రూ.52.09 కోట్లు, ఉద్యోగుల లోన్లకు రూ.2.7 కోట్లు కేటాయించారు.
అధిక భాగం వేతనాలు, పెన్షన్స్కే
యూనివర్సిటీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో అధిక భాగం ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లకే సరిపోతోంది. ఉద్యోగుల వేతనాలకు రూ.406.53 కోట్లు అవసరముండగా, వర్సిటీ మొత్తం బడ్జెట్ 54.47 శాతం కావడం గమనార్హం. అదేవిధంగా పెన్షన్లకు మరో రూ. 285.00 కోట్లు కేటాయించగా, ఇది 38.19 శాతంగా ఉంది. మిగిలినదాంట్లో 6.87 శాతం కాంటింజెన్సీకి, రూ.0.36 శాతం ఉద్యోగుల రుణాలకు కేటాయించారు. అయితే వేతనాలు, పెన్షన్స్కు మొత్తం బడ్జెట్ రూ.92.66 శాతం పోతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో
ఈ శాతం 65.75గా ఉండగా, ఉద్యోగులకు వేతనాలు పెరిగిన దృష్ట్యా వర్సిటీపై మరింత ఆర్థిక భారం పడింది.
వర్సిటీ అభివృద్ధికి బ్లాక్ గ్రాంట్స్ పెంపే ముఖ్యం అయితే ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్స్ వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోని పరిస్థితి ఉండడంతో యూనివర్సిటీ లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఉండటం లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందని పలువురు సీనియర్ అధ్యాపకులు వ్యాఖ్యానిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం అందించే నిధులను పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సరి పోను నిధులు ఉన్నప్పుడే వర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, పరిశోధనలను విస్తృతం చేయవచ్చని వివరిస్తున్నారు. సాధారణంగా యూనివర్సిటీ అవసరాలలో 65 నుంచి 70 శాతం నిధులను ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్ రూపంలో మంజూరు చేయాలని, మిగిలిన 30 నుంచి 35 శాతం నిధులు యూనివర్సిటీ అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోవాలని పేర్కొన్నారు.
పెరుగుతున్న ఖర్చులు. తగ్గుతున్న ఆదాయం
యూనివర్సిటీ స్థాపించి వందేండ్లు పూర్తయిన తరుణంలో పాత భవనాలు పనికిరాకుండా పోతున్నాయి. కొన్ని భవనాలు నివసించడానికి వీలులేకుండా ఉన్నాయని నిపుణులు తేల్చిచెబుతు న్నారు. దాంతో కొత్త భవనాలు నిర్మించుకోవల్సిన అవసరం ఉంది. కానీ అవసరమైన నిధులు అందుబాటులో ఉండడం లేదు. మరికొన్ని భవనాలకు మరమ్మతులకు కూడా లక్షల రూపాయల ఖర్చు అవుతుండడంతో వర్సిటీ నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం సివిల్ సర్వీసు అకాడమీ ఏర్పాటు, అనుబంధం కళాశాలల్లో గర్ల్స్ హాస్టల్స్ ఏర్పాటు, నూతన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, సెంటినరీకి గుర్తుగా పైలాన్ ఏర్పాటు చేస్తామని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పి.లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ ప్రొ.రెడ్యా నాయక్, డీన్స్, ప్రిన్సిపాల్స్, డెరైక్టర్స్, ఓయూ పాలక మండలి సభ్యులు, ఫైనాన్స్ అధికారులు పాల్గొన్నారు..