Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్ పేర్కొన్నారు. ఆదివారం ఈసీఐఎఎల్ నీలం రాజశేఖర్ రెడ్డి భవన్, మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా నేటి నుంచి 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు, ప్రజా సంఘాలను కోరారు. 10 రోజుల నుండి తొమ్మిది సార్లు చమురు ధరలను పెంచుకుంటూ పోతున్నారన్నారు. చమురు ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనీ, మోడీ ఏమాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ధరలు పెంచుకుంటూ పోతున్నాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతుందన్నారు. ఈ నెల 6వ తేదీన ఇందిరా పార్కు వద్ద జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ''బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు'' అని విభజన బిల్లులో హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ కర్మాగారం, గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి డిజి.సాయిలు గౌడ్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి, కావలి నర్సింహా, రొయ్యల కృష్ణమూర్తి, జే.లక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.శంకర్, ఉమామహేష్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.