Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ కన్వీనర్
- వడ్లమూరి కష్ణ స్వరూప్ ఆరోపణ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం తగులబెట్టడం వెనుక దురహంకార దోపిడీ కుల పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల హస్తం ఉందని నేషనల్ డెమోక్రటిక్ సెక్యూలర్ ఫ్రంట్ (ఎన్.డి.ఎస్.ఎఫ్) జాతీయ కన్వీనర్ వడ్లమూరి కష్ణ స్వరూప్ ఆరోపించారు. ఫ్రంట్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..స్వేచ్చ, సమానత్వం, సామాజిక న్యాయం అందించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ విగ్రహం పట్ల ఇంత ద్వేషంతో దారుణంగా నిప్పు పెట్టడం కుల వివక్షతే అన్నారు. పోలీస్ అధికార యంత్రాంగం సమక్షంలోనే ఈ దారుణానికి ఒడిగట్టడం అంటే నిమ్న జాతులపై జరిగిన దాడేనని అన్నారు. బాధ్యులు ఎవరు అనేది పోలీసులకు తెలిసిన అరెస్ట్ చేయడంలో జాప్యం చేయడం సరైంది కాదన్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి అంటే భారత రాజ్యాంగం మీద జాతి మీద దాడి చేసినట్లేనన్నారు. దేశంలో ఎక్కడ ఇంత అమానుషం జరగలేదని, కేవలం సీఎం కేసీఆర్ పాలనలోనే ఈ దారుణం జరగడం ఆయన చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. దళితులు రాజ్యాధికారం పొలిటికల్ పవర్ సాధన కోసం చైతన్యం అవుతున్న తరుణంలోనే సహించుకోలేని కాషాయ మనువాద దోపిడీ శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న రాష్ట్ర గవర్నర్, సీఎం కేసీఆర్ ఈ విషయంలో స్పందించకపోవడం కుల వివక్షతేనని ఆయన విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాల రక్షణ కోసం ముస్కర్ లకు కఠిన శిక్షలు విధించడానికి అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంఘటన వెనుక రాజకీయ పార్టీల నాయకుల హస్తం ఉన్నందున సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేసుకుని, విచారణ జరపాలని కోరారు. ఈ అమానుషమైన చర్యలకు పూనుకున్న దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర బంద్‌కు త్వరలో పిలుపు ఇస్తామన్నారు. సంఘటన జరిగిన గ్రామంలో 144 సెక్షన్ ఎత్తివేయాలని పోలీసులను కోరారు. హోం శాఖ మంత్రి, సోషల్ వెల్ఫేర్ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర డీజీపీ వెంటనే ఈ విషయంలో స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ సిలివేరి వసంతరావు, జాతీయ మీడియా ఇన్చార్జ్ సి.శ్యామ్ కుమార్, జాతీయ కమిటీ సభ్యులు దేవునూరి శ్రీనివాసులు, దళిత బహుజన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి రాజు, దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్ ఇటికాల గణేష్, మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అర్షల రాజు, గ్రేటర్ అధ్యక్షులు ఎ.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.