Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్
- రవీంద్ర భారతిలో పరావర్తనం పుస్తకం ఆవిష్కరణ సభ, హాజరైన ప్రముఖులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దక్షిణాఫ్రికాలో ఉంటూ తెలుగు సాహిత్యం మీద ప్రేమతో కవితా విమర్శ చేస్తున్న రాపోలు సీతారామ రాజు కృషి అభినందనీయమని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ అన్నారు. మంగళవారం రవీంద్ర భారతిలో జరిగిన ఆవిష్కరణ సభలో రాపోలు సీతారామ రాజు రాసిన పరావర్తనం పుస్తకం ఆవిష్కరించి ప్రసంగించారు. తెలుగు సాహిత్యం మీద ఇష్టం పెంచడానికి రాపోలు వ్యాసాలు ఉపయోపడతాయని అన్నారు. అన్ని రకాల వాదాల మీద చర్చకు సీతారామరాజు రచనలు తోడ్పడతాయని గౌరీ శంకర్ చెప్పారు. విశిష్ట అతిథిగా హాజరైన దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాపోలు సీతారామ రాజు రాసిన పరావర్తనం చదివితే ఆయా కవుల పుస్తకాలు చదవాలనే ఆసక్తి కలుగు తుందన్నారు. మానవ జీవన సారాన్ని వివరించేలా తన వ్యాసాలు ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకంగా ఒక ప్రక్రియలో రాయడానికి కృషి చేయాలని రాపోలు సీతారామ రాజును కోరారు. దక్షిణాఫ్రికాలో ఉన్న వివక్ష, సాహిత్యం, జీవితం గురించి రాయాలని అన్నారు. తెలుగు సాహిత్యం మీద మమకారంతో రాపోలు సీతారామ రాజు చేస్తున్న విమర్శనా వ్యాసంగం ఇక్కడి సాహిత్య విద్యార్థులకు, పరిశోధకులకు ప్రేరణ ఇస్తుందని సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఎస్.రఘు అన్నారు. ప్రముఖ విమర్శకుడు ఎం.నారాయణ శర్మ ప్రసంగిస్తూ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసే దృష్టిగల చక్కని విమర్శకుడని అభినందించారు. తెలుగు సాహిత్య విమర్శ సుసంపన్నం కావడానికి రాపోలు సీతారామ రాజు కృషి తోడ్పడుతుందని చెప్పారు. సాహిత్య విద్యార్థులంతా ఈ పుస్తకం చదవాలని వారు కోరారు.