Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితబంధును సద్వనియోగం చేసుకోవాలి
- ఎంచుకున్న రంగంలో ఆర్థికాభ్యున్నతి సాధించాలి
- మంత్రి చామకూర మల్లారెడ్డి
- లబ్దిదారులకు దళితబంధు మంజూరు పత్రాలు అందజేత
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వారి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు వారు ఎంచుకున్న రంగంలో రాణించాలని, ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున చేయూతనందిస్తామని, అందుకు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో దళితబంధు పథకం కింద జిల్లాలో అర్హులైన లబ్దిదారులకు మంత్రి మల్లారెడ్డి దళితబంధు మంజూరు పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జయంతి రోజు అర్హులైన దళితులకు దళితబంధు మంజూరు పత్రాలు అందజేయడం ఆయన కన్న కలలను నిజం చేయడమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు మంచి అవకాశం కల్పించి వారికి ఆర్థికంగా ఎదిగేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ అనుకున్న విధంగా అన్ని రంగాల్లో దళితులు గెలిచి తీరాలనీ, గౌరవంగా బతకాలనీ అందుకు రూ.10 లక్షలు అందజేస్తున్నారని చెప్పారు. దళితబంధు పథకం కింద 40 రకాల పనులు చేసుకోవచ్చని తెలిపారు. కిరాణ దుకాణం నుంచి వ్యాన్లు కొనుక్కునే వరకూ అధికారులు సమన్వయంతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారన్నారు. ఈ పథకం కింద వారి వారి ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయనీ, అవసరమైన అవగాహనను లబ్దిదారులకు సంబంధిత శాఖల అధికారులు, దళిత బంధు ప్రత్యేక అధికారులు కల్పిస్తారని వివరించారు. దళితబంధు కింద రెండో విడత లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు. దీనికి సంబంధించి లబ్దిదారులు అడిగిందే ఇస్తామనీ, అందులో ఎలాంటి బలవంతం ఉండదని తెలిపారు. ఈ పథకం కింద ఏర్పాటు చేసుకునే వివిధ పనులకు సంబంధించి లైసెన్సులు, పర్మిషన్లు జిల్లా కలెక్టర్‌తోపాటు ఆయా శాఖల అధికారులు చేస్తారని తెలిపారు. దళితులందరికీ మున్ముందు అన్ని రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించి వారి అభ్యున్నతికి పాల్పడే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, ఫీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, డీఆర్డీఏ పీడీ పద్మజారాణి, జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీ మల్లారపు ఇందిరా, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.