Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ హరీశ్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ఆస్పత్రులు, అల్ట్రాసౌండ్, స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఈ విషయంలో ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వాటిని మూసివేస్తామని కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. గురువారం మేడ్చల్ కలెక్టరేట్లో జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ విషయంలో తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. అలాగే ఈ నెల నుంచి రెవెన్యూ డివిజన్ల వారిగా పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఎన్జీవోలు, కలెక్టరేట్ ప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని వివరించారు. భ్రూణహత్యలు నివారించి ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. పుట్టబోయే ఆడపిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. పోలీస్, లీగల్ సర్వీస్ అథారిటీ బాధ్యులు లింగ నిర్ధారణకు సంబంధించి ప్రత్యేక దృష్టిసారించి ఎక్కడైనా అలాంటివి జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చట్టం ఆవశ్యకత, తదితరాలతో రూపొందించిన 'ఆడపిల్లల లోటు- సమాజానికి చేటు' అనే కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు, జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్ రెడ్డి, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాల అదాలత్ పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బాల అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల అదాలత్‌కు సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఏప్రిల్ 12న జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేడ్చల్ జిల్లాకు సంబంధించిన బాల అదాలత్‌ను నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన బాలలకు చెందిన సమస్యలను ఇందులో చర్చించి పరిష్కరిస్తామన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు సంబంధించిన విషయాలు, పాఠశాలల్లో వేధింపులు, అడ్మిషన్లు నిరాకరణ, వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు, లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, పిల్లలకు అందాల్సిన పరిహారాలు, వ్యాధులకు సంబంధించిన వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యం, సైబర్ నేరానికి సంబంధించిన యాసిడ్ దాడులకు గురైన పిల్లలు, వదిలివేసి నిరాదరణకు గురై అనాథలైన పిల్లలు, హెచ్ఐవీ వంటి వ్యాధులతో వివక్షకు గురైన పిల్లలు, పిల్లలను పోలీసులు కొట్టడం తదితర హక్కులకు సంబంధించిన ఉల్లంఘనకు గురైనవారు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా బాల అదాలత్‌ను అన్ని శాఖల వారు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఇంతియాజ్, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.