Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ముస్లిం మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు రంజాన్ సందర్భంగా ఆవాజ్ ఆధ్వర్యంలో మహిళల నేతృత్వంలో ముషీరాబాద్‌లోని జమిస్తాన్‌పూర్‌లో ఎప్రిల్ 16, 17తేదీలలో వివిధ రకాల వస్తువుల అమ్మకం స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ తెలిపారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించి వస్తువులు కొనుగోలు చేసి మహిళలను ప్రోత్సాహించాలని విజ్ఞప్తి చేశారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్ జమిస్తాన్‌పూర్‌లో ఏప్రిల్ 16,17 తేదీలలో జరగనున్న ఎగ్జిబిషన్ పోస్టర్‌ను ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్‌ఖాన్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరామ్ నాయక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటరమేశ్, నాయకులు సైదులు, రఘు తదితరులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మహిళలు, యువతులలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు కొంత కాలంగా ఆవాజ్ కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్, మెహందీ డిజైనింగ్, ఇంటర్వ్యూలు ఎదుర్కొనే శిక్షణ, వంటల ప్రోగ్రాం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నదని తెలిపారు. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు. చిన్న, చిన్న వత్తులు చేసుకునేవారు, వస్తువులు తయారు చేసే వారిని, చిన్న, చిన్న షాప్స్ నిర్వహించే వారికి ఎగ్జిబిషన్లో అవకాశం కల్పించి వారి ఆత్మ విశ్వాసం పెంచడానికి ఈ ఎగ్జిబిషన్ ఉపయోగ పడుతుందని అన్నారు. ముస్లిం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే విధంగా పథకాలు రూపోందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించాలని కోరారు.