Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీ, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
- తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను దృష్టిలో పెట్టుకుని ఆశాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, పెండింగ్‌లో ఆరునెలల పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం గోల్కొండ చౌరస్తాలో తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వ వైఖరిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో డీజిల్, పెట్రోలు, గ్యాస్, వంటనూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచిందనీ, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆశాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం జులై 2021 నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉంటే.. జనవరి 2022 నుంచి పెంచిన పీఆర్సీ అమలు చేసిందన్నారు. బకాయి ఉన్న పీఆర్సీ రూ.13,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ పారితోషికం పేరుతో ఆశాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారనీ, ఆశాలతో పారితోషికంలేని పని చేయించ వద్దని కోరారు. ప్రభుత్వం వారికి జాబ్‌చార్ట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నెలకు రూ.1000 చొప్పున 18 నెలల కరోనా ఇన్సెటివ్ వెంటనే ఇవ్వాలనీ, ఏపీలో మాదిరిగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలనీ, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలనీ, ఆశాలపై వేధింపులు ఆపాలనీ, రిజిస్టర్లకు అవుతున్న ఖర్చును ప్రభుత్వమే ఇవ్వాలనీ, ఎన్సీడీ సర్వే ఆశాలతో చేయించకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు జె.కుమారస్వామి, కోశాధికారి ఆర్.వాణి, ముషీరాబాద్ జోన్ కన్వీనర్ జి.రాములు, ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నగర అధ్యక్షులు యాదమ్మ పాల్గొన్నారు.