Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అల్వాల్‌లోని 578, 579, 576 సర్వే నెంబర్లతో ఉన్న తమ 6 ఎకరాల 4 గుంటల ముత్తాతల కాలం నుంచి వచ్చిన వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేయడంతో పాటు గుడిసెలు వేసుకుని ఉంటూ పూర్వకాలం నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు, పహానీలు ఉన్న తమ భూమిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా నవభారత్ సొసైటీ అనే సంస్థ పేరిట భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వడ్డేపల్లి నరసింహారావు, జె.సుధాకర్, మహిపాల్ రెడ్డి, రామ్ రెడ్డి, స్వామి గౌడ్, ప్రశాంత్ రెడ్డిలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితుడు అజిత్ జిలాని విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబ సభ్యులు రషీద్ అహ్మద్, కుద్దుస్ జిలాని, మసూద్ జిలాని, అక్తర్ అహ్మద్, యూసుఫ్ అహ్మద్, కలిమ్ ఫాతిమాతో కలసి అజీజ్ జిలాని మాట్లాడారు. భూముల విలువ పెరగడంతో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతో కొంతమంది రియల్ మాఫియా తమకు సంబంధించిన వ్యవసాయ భూమిపై కన్నేసి కబ్జాకు కట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అల్వాల్ ప్రాంతంలో వెయ్యి గజాల స్థలంలో భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చుకుని రౌడీలు, పోలీసుల అండతో బలవంతంగా మమ్మల్ని భూమిలో నుంచి గత నెల 5వ తేదీన వెళ్లగొట్టారన్నారు. తమ గుడిసెలను కూల్చివేసి అక్కడ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారన్నారని తెలిపారు. నవభారత్ సొసైటీ ఆక్రమణలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తే అసలు అది మీ భూమి కాదు.. పేదలకు పట్టాలు చేసి ఇచ్చిన స్థలం అనీ, అక్కడికి పోవద్దు అని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కాగితాలతో ఇచ్చిన నిర్మాణ అనుమ తులను రద్దు చేయాలని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను కోరినా ట్రిబ్యునల్ తీర్పును అమలు చేసి నవభారత్ సొసైటీ సభ్యుల దౌర్జన్యంపై కేసులు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. పైగా స్థలానికి సంబంధించిన సర్వే వివాదంపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే నిర్మాణ పనులను నిర్వహిస్తున్నార న్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలతోపాటు పోలీసులు మమ్మల్ని బెదిరించి కోర్టు కేసులను వెనక్కి తీసుకోవాలని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు బైలాస్తో ఏర్పాటైన నవభారత్ను కోర్టు రద్దు చేసినప్పటికీ వెంకటేశ్వర సొసైటీ అనే మరో సంస్థను స్థాపించి, తమ వ్యవసాయ భూమిని అక్రమంగా కొందరికి రిజిస్టర్ చేశారన్నారు. లింకు డాక్యుమెంట్లు లేకుండా రిజిస్ట్రేషన్ శాఖా అధికారులు ఈ భూమితో సంబంధం లేని అహ్మద్ ఫైజల్, అహ్మద్ సహా వారి కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తిగా చూపిస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. మైనంపల్లి అండతో అతని సహచరులు విలువైన తమ భూమిని ఆక్రమించుకోవడానికి తప్పుడు పత్రాలతో యు.ఎల్.సి. క్లియరెన్స్ తీసుకొని విద్యుత్, మంచినీటి కనెక్షన్లు తీసుకున్నారన్నారు. కబ్జాను వ్యతిరేకిస్తూ తమ స్థలం కోసం న్యాయపోరాటం చేస్తున్న తమను వేధిస్తూ కేసులు వెనక్కి తీసుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. మైనంపల్లి హనుమంతరావు నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు అల్వాల్ లోని పూర్వీకుల నుంచి సంక్రమించిన తమ భూమి తిరిగి తమకు దక్కేలా ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.