Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో హైపవర్ కమిటీ వేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్.బాల మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సిహ్మరెడ్డికి మెమొరాండం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీ పౌండర్ డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు, బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను తక్షణమే అటాచ్మెంట్ చేయాలన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు కొనుగోళ్లు చేసిన వారందరికీ స్వాధీనం చేయాలనీ, అగ్రిగోల్డ్ సంస్థ మోసాల వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి డిపాజిటర్ల పేర్లతో తెలంగాణతోపాటు 8 రాష్ట్ల్రాల్లోని 32 లక్షల మంది నుంచి రూ. 7 వేల కోట్లకు పైగా పలు స్కీముల పేరా వసూలు చేసి మోసం చేసిందిన్నారు. వసూలు చేసిన డబ్బుతో అగ్రిగోల్డ్ కంపెనీ ప్లాట్స్, రిసార్ట్ నిర్మించారని తెలిపారు. 2015లో వారి డబ్బులు తిరిగి ఇవ్వకుండా చేతులెత్తేసిందన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ మేనేజ్మెంట్ ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుందన్నారు. తమ కష్టార్జితం నష్టపోయా మని అనుకున్న కొంతమంది డిపాజిట్ దారులు ఆత్మ హత్యలు చేసుకున్నారనీ, ఏజెండ్ల ఇండ్ల మీద దాడులు చేసి కొట్టారని తెలిపారు. డిపాజిటర్లకు ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి బాధితులను ఆదుకుంటామని ప్రకటించాయనీ, ఆచరణలో ఆంధ్రప్రదేశ్లో తప్పా ఎక్కడా డిపాజిట్లు రాలేదన్నారు. అగ్రి గోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసిన వారు 5 లక్షల మంది ఉన్నారనీ, వీరు రూ.500 కోట్లకు పైగా డిపాజిట్లు చేశారని తెలిపారు. తెలంగాణలో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు రూ.1000 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ మూతపడి ఏడేండ్లు అయ్యిందనీ, అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కాకపోవడంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉందనీ, కొంతమంది అగ్రిగోల్డ్ ఆస్తులు ఆక్రమించుకుని వారికి వారే బదిలీ చేసుకున్నారన్నారు. కోర్టులో కేసులు నడుస్తున్నాయనీ, వీరి సమస్యల పరిష్కారానికి అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర సంఘం ఏర్పాటు చేశామనీ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్కు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు రొయ్యల కృష్ణమూర్తి, తోటపల్లి శంకర్, కె.సహదేవ్, డి.జంగయ్య, కె.ఐలయ్య, స్వరూప, విజరు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.