Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింఛన్ కోసం నెలల తరబడి నిరీక్షణ
- వృద్ధులను తిప్పుకుంటున్న అధికారులు
- ఈసడింపు సమాధానంతో ఇక్కట్లు
నవతెలంగాణ-బోడుప్పల్
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తలెత్తుకుని జీవించేలా ఆసరా పింఛన్ పథకాన్ని ప్రారంభించా మని సీఎం కేసీఆర్ ఆనేక సభల్లో చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. కార్పొరేషన్ల పరిధిలో ఈ పింఛన్లు పోస్టాఫీస్‌లలో పంపిణీ చేయాలనే నిర్ణయం వల్ల లబ్దిదా రులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి పింఛన్ కోసం వచ్చేవారికి నీడ, టారులెట్స్, మంచినీరు వంటి సౌకర్యాలు కూడా చాలా చోట్ల లేకపోవడం వల్ల అవస్థలు పడాల్సి వస్తోంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని రకాల పింఛన్ లబ్దిదారులు కలిపి సుమారు 1950 మంది ఉన్నారు. పింఛన్లు పొందడంలో అనేక అవస్థలు పడాల్సి వస్తోంది.
పింఛన్లు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు కానీ వాస్తవంలో అందుకు భిన్నంగా ఉంది. ప్రతి నెలా 5,6 తేదీల్లో పింఛన్లు అంది ంచే అధికారులు నాలుగు నెలలుగా సక్రమంగా ఇవ్వడం లేదనీ, ఆలస్యంగా ఇస్తున్నారనీ, సమయానికి పింఛన్ వచ్చేలా చూడాలని లబ్దిదారులు కోరుతున్నారు.
ఈసడింపు సమాధానం
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరిపైనా ఆధార పడకుండా ఆసరా పింఛన్లు అందజేస్తుంటే అవి పంపిణీ చేయా ల్సిన కొందరు అధికారులు వృద్ధులు అనే గౌరవం లేకుండా అమ ర్యాదగా మాట్లాడుతున్నారని కొందరు లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ''పింఛన్ ఎప్పుడొస్తది' అని అడిగితే ''ఎప్పుడొస్తే అప్పుడు రండి. ఎంత మందికి సమాధానం చెప్పాలి. వచ్చినప్పుడు ఇస్తాం. ముందు మీరు బయటకు వెళ్లండి'' అంటూ పింఛన్లు ఇవ్వా ల్సిన సిబ్బంది దురుసుగా ప్రవర్తిన్నారని బాధితులు చెబుతున్నారు.
ఆసరా ఫింఛన్లు క్రమం తప్పకుండా ఇవ్వాలి
సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తమను మించిన సర్కారే లేదంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు. పింఛన్ల మీదే ఆధారపడి జీవించే వారికి నెల నెలా క్రమం తప్పకుండా పింఛన్లు అందజేయాలి. ఖజానాలో డబ్బుల్లేవు. మళ్లీ రండి అంటూ తిప్పడమంటే వృద్ధులను ఇబ్బందులకు గురి చేయడమే. ఆసరా ఫింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్న వారిలో చాలా మందికి షుగర్, కాళ్ల నొప్పులు, హద్రోగ సంబంధ వ్యాధుల వారు ఉంటారు. పింఛన్లు పంపిణీ చేసే పోస్టాఫీసుల వద్ద కనీసం మరుగుదొడ్లు, కూర్చునే సదుపాయాలు కానీ ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చేటు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
- ఎన్.సజన, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, మేడ్చల్-మల్కాజిగిరి
గంటల తరబడి లైన్లో నిలబడుతున్నం
వృద్ధాప్యంలో రోగాలొస్తే మందులకో, ఇతర ఖర్చులకో ఎవరి వద్ద చేయిచాచకుండా నెల నెలా వచ్చే పింఛన్ డబ్బులతో అవసరాలు తీర్చుకుంటాం. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెల నెలా సరిగ్గా ఇవ్వకపోవడంతో ఇంటా, బయట తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పింఛను కోసం వచ్చి గంటల తరబడి లైన్లో నిలబడితే తీరా అధికారులు ఈ రోజు కాదు రేపు రండి అని తరచూ చెప్పే సమాధానంతో ఇబ్బంది పడుతున్నాం.
- లక్ష్మి, ఇందిరానగర్ కాలనీ
మా అకౌంట్లో డబ్బులు జమ కాలేదు
నెల నెలా వివిధ రకాల లబ్దిదారులకు పంపిణీ చేసే పింఛన్ డబ్బులు ఇంకా పైస్థాయి నుంచి మా అకౌంట్లో పడలేదు. అందుకే మేం ఇవ్వలేదు. డబ్బులు పడగానే లబ్దిదారులకు పంపిణీ చేస్తాం.
- రాజశేఖర్, పోస్టల్ అసిస్టెంట్, బోడుప్పల్ పోస్టాఫీసు