Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెత్తను తరలించే కంటైనర్ల సంఖ్య పెంచాలి
- సీఐటీయూ సౌత్ జిల్లా కార్యదర్శి నాగేశ్వర్
నవతెలంగాణ-ధూల్‌పేట్
జియాగూడ డంపింగ్ యార్డ్‌లో చెత్తను తరలించే కంటైనర్ల సంఖ్య పెంచాలని సీఐటీయూ సౌత్ జిల్లా కార్యదర్శి నాగేశ్వర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి జియాగూడ చెత్త డంపింగ్ యార్డ్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా స్వచ్ఛ ఆటో డ్రైవర్లు గంటల తరబడి నిలబడి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. దీంతో స్థానికంగా బస్తీలలో చెత్తను సేకరించడం ఆలస్యమవుతుందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను తరలించేందుకు సరిపడా కంటైనర్లు లేకపోవడంతో స్వచ్ఛ ఆటోలు నాలుగు గంటల పాటు నిల్చి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కంటైనర్ల సంఖ్యను 35కు పెంచి డంపింగ్ యార్డులో వెంటనే చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాంకీ యాజమాన్యం త్వరగా స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికుల తో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డంపింగ్ యార్డ్ మేనేజర్ బాలాజీకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కే.రంగన్న, డి.సాంబయ్య, సుంకన్న, రాము, సీపీఐ (ఎం)జియాగుడ కార్యదర్శి చుక్క.నర్సింహా తదితరులు పాల్గొన్నారు.