Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
విద్యార్థులను కేవలం విద్యకే పరిమితం చేయకుండా వారికి అభిరుచి ఉన్న రంగంలో ప్రోత్సహించాలని గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో వైఎంసీఏలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం విద్యార్థులను చదువుకే పరిమితం చేస్తుండటంతో వారిలో సృజనాత్మకత, క్రీడలు లాంటి వాటిలో రాణించే అవకాశం కోల్పోతున్నారన్నారు. సికింద్రాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో కొన్ని దశాబ్దాల నుంచి విద్యార్థులకు పలు అంశాల్లో సమ్మర్ క్యాంపు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తుండటం అభినందనీయమన్నారు. వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జయకర్ డేనియల్ మాట్లాడుతూ 25 అంశాల్లో నెల రోజుల పాటు అతి తక్కువ ఫీజులతో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. అబాకస్, ఫ్రెంచ్, షటిల్, బాస్కెట్ బాల్, కిక్ బాక్సింగ్, పోక్ డ్యాన్స్, కరాటే, అబాకస్, కీబోర్డు, వయలిన్ తదితర వాటిని నిపుణులతో శిక్షణ అందిస్తున్నామన్నారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ తరగతులు కొనసాగు తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎంసీఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంపత్, లెనార్డ్, కెన్నెత్, శ్యామ్ ప్రసాద్, ఈబర్ పాల్, హానోక్, ఆనంద రావు, తదితరులు పాల్గొన్నారు.