Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిక్కిరిసిపోతున్న అంబేద్కర్ గ్రంథాలయం,
- సివిల్ సర్వీసెస్ అకాడమీ శిక్షణా మైదానాలు
- ప్రిపరేషన్‌పైనే కేంద్రీకరించిన విద్యార్థులు
- లైబ్రరీలో, బాత్రూమ్స్ వద్ద బారులు
- టారులెట్స్లో మంచినీళ్లు లేక వెదజల్లుతున్న దుర్వాసన
- కొనసాగుతున్న వర్కుషాప్ మరమ్మతులు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యోగాల ఫీవర్ అంటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడంతో కొన్నేండ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులు బిజీ అయిపోయారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రిపరేషన్‌పై దృష్టిసారించారు. దీంతో ఓయూలోని అంబేద్కర్ లైబ్రరీ, సివిల్ సర్వీసెస్ అకాడమీ శిక్షణా మైదానాలు ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు పోలీసు ఉద్యోగాలకోసం సోమ, బుధవారాల్లో గ్రూప్-01 నోటిఫి కేషన్స్ జారీ అవ్వడంతో ఆశావహుల్లో మరింత ఉత్సాహం కనిపి స్తోంది. పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
ఇదే చివరి చాన్స్.. చావో.. రేవో
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీకాకపోవడంతో, మరోవైపు వయోపరిమితి పెరిగిపో తుండటంతో కొందరు పెళ్లిళ్లుకాక ఇబ్బందిపడ్డారు. ఇంకోవైపు డబుల్ పీజీకి మెస్ సౌకర్యాలు లేకపోవడం, ఇక్కడే ఉండి ఉద్యోగాలకోసం ఎదురు చూడటంతో అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ కావడంతో వర్సిటీలో చదువుకుం టున్న విద్యార్థులు చాలా సీరియస్‌గా ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టారు. మళ్లీ నోటిఫికేషన్లు వస్తాయో రావో, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో సర్వశక్తులూ ఒడ్డుతూ చావో రేవో తేల్చుకుందాం అన్నతీరుగా ప్రిపేర్ అవుతున్నారు.
కంటిమీద కునుకు లేకుండా పుస్తకాలతో కుస్తీ...
రానున్న ఎన్నికల తరువాత నోటిఫికేషన్ జారీ చేయరని, ఒక వేళ చేసినా ఇంతపెద్ద సంఖ్యలో ఖాళీపోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఉండవని భావిస్తున్న ఓయూ విదాయర్థులు పట్టువీడని విక్రమార్కుల్లా, కంటిమీద కునుకు లేకుండా ఉద్యోగాలకోసం సిద్ధం అవుతున్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలతో, వివిధ సబ్జెక్టులు, మెటీరియల్స్‌తో కుస్తీతపడుతున్నారు. ఇంకోవైపు తమ మిత్రులతో కలిసి సమకాలీన అంశాలపై గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు. కొంత మంది ఓయూలో అందుబాటులో లేని బుక్స్‌ను కొనుక్కొని, సంబంధిత మెటీరియల్స్ పోగుచేసుకొని ఎలాగైనా ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడాల్సిందేనన్న కసితో ప్రిపేరవుతున్నారు.
కిక్కిరిసిపోతున్న లైబ్రరీ, శిక్షణా తరగతులు, క్రీడా మైదానాలు
ఇక ఓయూ డా.బి.ఆర్.అంబేద్కర్ లైబ్రరీ సామర్థ్యం కన్నా రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వచ్చి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. దీంతో లైబ్రరీకి ముందుగా వచ్చిన వారికి తప్ప తర్వాత వచ్చిన వారికి కూర్చునేందుకు జాగా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. అక్కడ మూత్రశాలాల వద్ద కూడా బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం మంచి నీళ్లు, కుర్చీలు కూడా సరిపడా ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సోమవారం నుంచి ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ప్రిపరేషన్ కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఫలితంగా హాల్ సరిపోవడంలేదు. కొందరు విద్యార్థులు ఆరుబయట కూర్చుని సబ్జెక్టు నిపుణులు చెప్పే పాఠాలు వింటున్నారు. ఇక పోలీసు జాబ్స్ కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు మాత్రం ఉదయం, సాయంత్రం సమయం లో రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ఫుట్లకు ప్రిపేర వుతూ మిగతా సమయంలో లైబ్రెరీలో ప్రిపేర్ అవుతున్నారు.
సౌకర్యాలు కల్పించాలి:ఎస్.క్రాంతి నాయక్ , పీహెచ్డీ స్టూడెంట్
నేను గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవు తున్న. లైబ్రరీలో సామర్థ్యానికి మించి రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు వస్తు న్నారు. కుర్చీలు, టేబుల్స్ సరిపోవడం లేదు. దీంతో కొన్నిసార్లు విద్యార్థుల మధ్య గొడవ అవుతోంది. లైబ్రరీలో తాగేందుకు మంచినీరు ఉండటం లేదు. ఇక మూత్రశాలాలైతే దుర్వాసన వెదజల్లుతున్నాయి. బాత్రూమ్స్ క్లీన్ చేయని కారణంగా ఇటీవల ఓ విద్యార్థి కిందపడిపోయిన సంగతి తెలిసిందే. తక్ష్, ఫౌండేషన్ డేల ద్వారా నిధులు వృథా తప్ప ఉపయోగం లేదు. వాటికి వెచ్చించే నిధులతో ఇక్కడ మాకు కనీస సౌకర్యాలు కల్పించాలి. కాంపిటీషన్ బుక్స్, మెటీరియల్స్ అందుబాటులో లేవు. అసలే వేసవి కాలం కొన్ని ఫ్యాన్స్ కూడా పనిచేయడం లేదు.
అనూహ్య స్పందన,ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ డెరైక్టర్ ప్రొ. చింతగణేష్
ఈనెల 25 నుండి ఆర్ట్స్ కాలేజ్‌లో గ్రూప్స్‌కు సిద్ధమయ్యే వారికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల నుండి అనూహ్యమైన స్పందన వస్తోంది. చాలామంది వస్తుండటంతో హాల్ సరిపోక రెండు బ్యాచ్‌లుగా చేసి రెండు హాళ్లలో సబ్జెక్ట్ నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పిస్తాం.
విద్యార్థులు ఎక్కువగా వస్తున్నారు
యూనివర్సిటీ లైబ్రేరియన్ డా.ఎ.ఎస్.చక్రవర్తి
లైబ్రరీ సామర్థ్యం వెయ్యిమంది వరకే. నోటిఫికేషన్ జారీతో 1500 మంది విద్యార్థులు వస్తున్నారు. వాటర్, బాత్రూమ్స్ సమస్య పరిష్కా రానికి, అదేవిధంగా 300 కుర్చీ లు కావాలని అధికారులకు లెటర్ రాశాను. ఈ మార్చిలో విద్యార్థులు సూచించిన లక్ష యాభై వేల రూపాయల బుక్స్ కొనుగోలు చేశాను. ఇక్కడ ఒక బోర్ అవసరం ఉంది. తాత్కాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను.
నత్తనడకన వర్కుషాప్ మరమ్మతులు
ఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడమీ కోసం సైన్స్ కాలేజీ సెంట్రల్ వర్క్‌షాప్‌కు కొన్నినెలల కిందట మరమ్మతు పనులు చేపట్టారు. నేటికీ పూర్తికాలేదు. గత్యంతరంలేక తాత్కాలికంగా ఆర్ట్స్ కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అటు లైబ్రెరీ, ఇటు గ్రౌండ్స్‌లలో శిక్షణ తరగతులవద్ద యూనివర్సిటీ యంత్రాంగం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కోరుతున్నారు.