Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గ్రామీణ పేదల సంఘం
నవతెలంగాణ-అడిక్మెట్
దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న పోడు భూములపై గ్రామీణ పేదలు తమ హక్కులు సాధించేవరకు తమ పోరాటం ఆగదు అని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పడిగా ఎర్రయ్య అన్నారు. తెలంగాణ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పర్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పడిగ ఎర్రయ్య, ఉపాధ్యక్షులు నేతవత్ రాందాస్ హాజరై మాట్లాడుతూ జీవనోపాధి కోసం పోడుభూములు సాగు చేసుకుంటున్న గిరిజన పేదలపై నాలుగు వైపుల నుంచి దాడి సాగుతుందన్నారు. భూస్వాములు, రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ వ్యవస్థలు దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్న గిరిజనులను చెట్లకు కట్టేసి కొట్టడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో కూడా జరిగాయని గుర్తు చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్, ఐటీడీఏ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వాలు ఖాతరు చేయడం లేదని వాపోయారు. ఏది ఏమైనా తాము సాగు చేసుకుంటున్న పోడు భూములపై హక్కుల కోసం గిరిజన పేదలందరూ సంఘటితంగా పోరాడి భూములను పరిరక్షించుకోవాలని పిలుపునిస్తున్నారు. ఈ సమస్యలపై గిరిజన పేదలకు అండగా నిలవాలని వారి పోరాటానికి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం కార్యదర్శి వెంకట దాస్, సహాయ కార్యదర్శి పోలబోయిన ముత్తయ్య, ఓపీ డీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జతిన్ కుమార్ పాల్గొన్నారు.