Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రమశక్తి అవార్డు గ్రహీత, కార్మిక నాయకులు ముద్దాపురం మదన్‌గౌడ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
'నా జీవితం కార్మికుల సంక్షేమానికి అంకితం. వారికి అండగా ఉంటూ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాను' అని శ్రమశక్తి అవార్డు గ్రహీత, స్వర్ణ కంకణ సన్మాన గ్రహీత, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు ముద్దాపురం మదన్‌గౌడ్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) నేపథ్యంలో శుక్రవారం షాపూర్‌లోని తన కార్యాలయంలో ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, షాపూర్‌నగర్‌లో నివాసం ఉంటూ కార్మిక నాయకుడిగా గత మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నానని చెప్పారు. జీడిమెట్ల, గాంధీనగర్, బాలానగర్ పారిశ్రామిక వాడల్లోని చాలా పరిశ్రమల్లో తాను కార్మిక నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించానన్నారు. కార్మికుల పక్షాన వారి హక్కుల కోసం పోరాడినందుకు నిరంతరం వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డును అందజేసిందని తెలిపారు. 2012లో దక్షిణ కొరియా దేశంలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో పాల్గొనడానికి మన భారతదేశం తరపున కేంద్ర కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి వసుంధర శర్మ, ముద్దాపురం మదన్గౌడ్లతో పాటు 11 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. అదే విధంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోగల పోరస్ ల్యాబ్ ప్రయివేటు లిమిటెడ్ కార్మికుల సంక్షేమం కోసం ఆమోదయోగ్యమైన భారీ అగ్రిమెంట్ చేసినందుకు కార్మికులు స్వర్ణ కంకణంతో సన్మానించారని చెప్పారు. కరోనా విపత్కర సమయంలో కార్మికులకు అనేక రకాలుగా విశిష్ట సేవలు అందించేందుకు చైన్నైకి చెందిన సంస్థ అయినటువంటి గ్లోబల్ హ్యూమన్ పీఎస్ యూనివర్సిటీ ప్రతినిధులు అవార్డు అందజేశారని తెలిపారు. గతంలో ఐఎన్టీయూసీ కార్మిక నాయకుడిగా ఉన్న సమయంలో కార్మికులకు చేస్తున్న సేవలను గుర్తించి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అప్పటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉత్తమ కార్మిక నాయకుడిగా గుర్తించి సన్మానం చేశారని తెలిపారు. ఆరోజు కార్యక్రమంలో ఇప్పటి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు.
షాపూర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని గతంలో కొందరు కబ్జాకు యత్నించారని, దానిని అడ్డుకుని కాపాడానని తెలిపారు. అంతే కాకుండా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకొరావడంతోపాటు పాఠశాల విద్యా కమిటీ చైర్మెన్‌గా ఎన్నో సేవలు అందించానన్నారు.
రెడ్డీస్ ల్యాబ్‌లో నాయినిపై గెలుపు
ఇదిలా ఉండగా 30 ఏండ్ల కిందట జనతాదళ్పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నాయిని నర్సింహారెడ్డిపై డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన యూనియన్ ఎన్నికల్లో తాను పోటీ చేసి ఘన విజయం సాధించానని చెప్పారు. నాటి నుంచి కార్మిక నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ కార్మికుల పక్షపాతిగా వారి గుండెల్లో స్థానం కల్పించుకున్నానని అన్నారు.
మే డేను జయప్రదం చేయాలి
మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు షాపూర్‌నగర్‌లోని శ్రమశక్తి కూలీ సంఘం అడ్డావద్ద అన్ని కంపెనీల కార్మికులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.