Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై అధ్యయనానికి ఇంటింటి సర్వే
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డిజి.నర్సింహారావు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డిజి.నర్సింహారావు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యల అధ్యయనం కోసం మే 2 నుంచి 15 వరకు సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం షాపూర్‌నగర్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో వెంకటరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
మే 2 నుంచి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గుర్తించిన బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం ప్రజలను సమీకరించి పోరాటం నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి పాదయాత్రల పేరుతో, ప్రజలను మతాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారమే పరమావధిగా ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు ప్రారంభించాయన్నారు.
రైతులు పండించిన వడ్లను కొనాలని కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పోటాపోటీగా ధర్నాలు చేసి ప్రజలను అయోమయంలో పడేశాయని విమర్శించారు. ఇలాంటివి ప్రజలు గుర్తించి అధికార పార్టీలను నిలదీయాలన్నారు. 2016లో డబుల్ బెడ్ రూంల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు ఇప్పటికీ ఇండ్లు ఇవ్వలేదన్నారు. 2014 నుంచి పింఛన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిలా కార్యదర్శి పి.సత్యం, కమిటీ సభ్యులు కీలుకాని లక్ష్మణ్, జి.అశోక్, ఐ.రాజశేఖర్, ఎం.నరేష్, శంకర్, సి.హెచ్.కృష్ణారావు, బి.సత్యం, ఆర్.లక్ష్మి, ఆర్.స్వాతి, బీరప్ప, దేవదానం, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.