Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
ఎల్పీజీ గ్యాస్ వినియోగంపై అవగాహన పెంచుకుని జాగ్రత్తలు పాటించి ప్రమాదాలను నివారించాలని ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ హెడ్ ఆర్ఎస్ఎస్ రావు సూచించారు. ఆదివారం పార్క్ లైన్‌లోని ఇన్ క్రేడిబుల్ హౌటల్లో ఉజ్వల దివాస్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల పథకంలో లబ్ధిదారులకు గ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ లీకైతే 24 గంటలు పని చేసే 1906 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. గ్యాస్ స్టవ్‌ను ప్లాట్ ఫామ్‌పై ఉంచి కింద గ్యాస్ సిలిండర్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్‌ను పడుకోబెట్టకుండా నిల్చో బెట్టాలని సూచించారు. గ్యాస్ లీక్ అవుతున్న వాసన వస్తే లైట్లు వెలిగించకూడదన్నారు. గ్యాస్ స్టౌ ఆన్ చేసే ముందు ఒకసారి వెలిగించి చూడాలనీ అటు తర్వాత ఆన్ చేయాలన్నారు. భయటకు వెళ్లినపుడు, రాత్రి పడుకునే సమయంలో రెగ్యులేటర్ తప్పక ఆఫ్ చేసుకోవాలన్నారు. గ్యాస్ స్టవ్ దగ్గర మంటలు అంటుకునే, పేలుడు స్వభావం ఉన్న వస్తువులను ఉంచకూడదన్నారు. గ్యాస్ వినియోగదారుల బస్తీల వద్దకు వెళ్లి మరింత అవగాహన కల్పించాలని డీలర్లకు సూచించారు. తెలంగాణాలో 4.6 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా అన్ని ఆయిల్ కంపెనీలకు చెందినవి 11.10 లక్షలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ సేఫ్టీపై ప్రశ్నలు అడిగి సరియైన సమాధానాలు చెప్పిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ఇండియన్ గ్యాస్ డీలర్లు, వినియోగదారులు పాల్గొన్నారు.