Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ,మేడ్చల్
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ వాప్తంగా సీఐటీయూ, పలు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండావిష్కరణలు, ప్రదర్శనలు, సభలు నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు ఎర్రజెండాలను ఎగురువేసి మే డే పుట్టుక, ప్రధాన్యతలను గుర్తు చేసుకున్నారు. మే డే స్ఫూర్తితో భవిష్యత్తులో కార్మిక, కర్షక హక్కులకోసం పోరాడాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడ్చల్ పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఆవిష్కరించారు. భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు దేవరెడ్డి హాజరై వారు మాట్లాడుతూ.. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం కార్మికులు పెద్దఎత్తున పోరాటం చేశారని, ఈ పోరులో నేలకొరిగిన వారికి నివాళిగా ఏటా మే డే జరుపుకుంటున్నామని తెలిపారు. ఇటువంటి త్యాగాలతో సాధించుకున్న హక్కులను నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని చెప్పారు. దేశంలో కుల, మత, లింగ భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు ఉంటాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రాబోయే రోజుల్లో హక్కులకోసం, కేంరద, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూమండల కార్యదర్శి మందపురం నరేష్, సీనియర్ నాయకులు రమేష్, కొమురయ్య, నర్సింగరావు, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.