Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ జోన్ భరత్ నగర్లో సీఐటీయూ జెండాను బస్తీ నాయకురాలు పద్మ ఆవిష్కరించగా.. వారోత్సవాల శిబిరాన్ని సీఐటీయూ రాష్ట్ర నాయకులు డీజీ. నరసింహారావు ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే వారోత్స వాల్లో భాగంగా భరత్ నగర్, అంబేద్కర్ నగర్ బస్తీల్లో మే 7 వరకు ఆటలు, సంస్కతిక పోటీల్లో పాల్గొనాలన్నారు. మేడే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న సమస్త కార్మిక వర్గం రంగు, ప్రాంతం, కుల మత తేడాలు లేకుండా ఒక పోరాట దినోత్సవంగా మేడేని జరుపుకుంటారన్నారు. కార్మికులను కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఐక్యం చేయడానికి కార్మికులందరూ ఒకటే అని చాటి చెప్పడానికి, కార్మికుల్లో ఐక్యతను పెంపొందించడానికి సీఐటీయూ ఈ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, నగర కార్యదర్శి ఎం.వెంకటేష్, ఉపాధ్యక్షులు కుమార స్వామి, ముషీరాబాద్ జోన్ కన్వీనర్ జి.రాములు, భరత్ నగర్ బస్తీ నాయకులు ఆంజనేయులు. అంబేద్కర్ నగర్ బస్తీ నాయకులు నరసింహ, తదితరులు పాల్గొన్నారు.