Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ సివిల్ జడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మురళి మోహన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కార్మికులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటం కోసం చట్టాలను అధ్యయనం చేయాలని, కనీసం వాటిపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి కె.మురళీమోహన్ అన్నారు. మే డే సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యూసఫ్‌గూడలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి కె.మురళీమోహన్ మాట్లాడుతూ కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
కార్మికులు తమ హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలను సాధించారని, అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, అర్హులైన కార్మికులు ఆ చట్టాలను ఉపయోగించుకోవాలంటే వాటి పట్ల కనీస అవగాహన ఎంతో అవసరం అని వివరించారు. భవన నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డును కేవలం రూ.110 చెల్లించి పొందవచ్చని, ఆ గుర్తింపు కార్డు పొందిన కార్మికులకు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే కార్మిక శాఖ తరపున ఆరు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని, సాధారణ మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయలతోపాటు వారి పిల్లల పెళ్లిళ్ల సందర్భంలో ప్రసవం వంటి పలు సందర్భాలలో ఆర్థిక సహాయాన్ని పొందవచ్చునని వివరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈశ్రమ్ కార్డులను ప్రతి అసంఘటిత కార్మికులు ఉచితంగా పొందవచ్చని, కార్డు పొందిన కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తిస్తుందని వివరించారు.
యూసుఫ్‌గూడాలోని పలు కూడళ్లలో జరిగిన వేర్వేరు న్యాయ విజ్ఞాన సదస్సులలో న్యాయమూర్తి కె.మురళీమోహన్ కార్మికులకు పలు సూచనలు చేశారు. కార్మిక చట్టాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ సరోజ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కె.మురళీమోహన్ మహిళా కార్మికులను సన్మానించారు.