Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కలను మేస్తున్న మేకలు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-జవహర్నగర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నీరు గారిపోతుంది. ఏడు విడుదలుగా సీఎం కేసీఆర్ మొదలుకుని కార్యకర్త వరకూ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటిన సంరక్షించాల్సిన బాధ్యతలు స్థానిక మున్సిపాలిటీ అధికారులకు అప్పగించినప్పటికీ వాటి సంరక్షణలో అధికా రులు విఫలమవుతున్నారు. పేరుకి లెక్కల్లో లక్షల్లో మొక్కలు నాటుతున్నామని చూపుతున్న ప్పటికీ వాస్తవికంగా క్షేత్రస్థాయిలో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయని సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి. ఎంతో ఖర్చు చేసి హంగు ఆర్భాటాలతో మొక్కలను నాటి వాటిని కాపాడుకోలేకపోతున్న పరిస్థితి నెలకొంది. మేడ్చల్, జవహర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని తంగాడి వనం పార్కులో ఏర్పాటు చేసిన హరిత హారం మొక్కలను మేకలు తింటున్నా పట్టించు కునే అధికారులే లేకుండా పోయారు. మొక్కలు పూర్తిగా ఎండిపోవడంతో ఆ ప్రాంతమంతా ఎడారిగా మారింది. జవహర్నగర్ మున్సిపాల్టీ పరిధిలో సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మంత్రి మల్లారెడ్డి స్వయంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి శ్రీకారం చుట్టిన మున్సిపాలిటీలోనే ఈ పరిస్థితి ఉందంటే మిగతా మండలాలు, మున్సిపాలిటీల పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. కనీసం జవహర్నగర్ మున్సిపల్ పరిధిలో అధికారులు హరితహారం కార్యక్రమం విషయంలో శ్రద్ధ వహించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి అధికారులు తూట్లు పొడవడం మీద కాకుండా కనీసం మొక్కలకు ఎరువులు, నీరు పోసి వాటి సంరక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవడంలో కూడా ఘోరంగా విఫలమవుతున్నారు. కనీసం మొక్కలను కూడా పట్టించుకున్న పాపాన పోలేదని అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.