Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మానసిక సమస్యల నివారణకు సైకాలజిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లో తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ ఐదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలని, ఇందుకుగాను స్కూళ్లలో సైకాలజిస్టుల నియామకాలకు కషి చేస్తామన్నారు. వ్యక్తుల్లో విపరీత ధోరణులు పోగొట్టడానికి సైకాలజిస్టుల అవసరం ఎంతైనా ఉందన్నారు. సైకాలజిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటుకు తనవంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ దేవీప్రసాద్ రావు మాట్లాడుతూ మానసిక వైకల్యం కలిగిన వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత సైకాలజిస్టులపై ఉందన్నారు. నేడు అంతర్జాల మాయలో పడి మానవ సంబంధాలు మరిచిపోతున్నారని, సోషల్ మీడియా, సెల్‌ఫోన్ ప్రపంచంలో మునిగి ఇదే ప్రపంచం అనే రీతిలో తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో కనీసం పలకరించే స్థితిలో లేకుండా పోయిందన్నారు. ఈ వ్యసనాలతో మానసిక అనారోగ్యానికి గురై వ్యతిరేక ధోరణులతో సమాజంలో సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రాంచందర్ మాట్లాడుతూ సమాజ సేవే ఆదర్శంగా యువత మార్పే ధ్యేయంగా ఐదు వసంతాలు పూర్తి చేసుకోవడం హర్షించదగ్గ పరిణామమన్నారు. స్వలాభం కోసం కాకుండా తెలంగాణలో సైకాలజిస్టుల కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ తమదేనన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంపటి రాజు, కార్యదర్శి డాక్టర్ లక్ష్మి నిప్పణి, నాయకులు డాక్టర్ జి.సి కవిత, డాక్టర్ శిల్పా, డాక్టర్ అర్చన, జగదీశ్వర్ రావు, అరుణ్ కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.