Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 29న రెడ్డి సింహగర్జన సభ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
పేద రెడ్ల సంక్షేమానికి ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో రెడ్డి సంఘాల జేఏసీ నాయకుల సన్నాహక సమావేశంలో ఈ నెల 29న నగరంలో నిర్వహించే రెడ్డి సింహగర్జన సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అప్పమ్మగారి రాంరెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ పేద రెడ్ల సంక్షేమానికి ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఈ నెల 29న హైదరాబాద్ శివారు ప్రాంతా ఔటర్ రింగు రోడ్డులో ఘట్కేసర్ వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో సాయంత్రం నాలుగు గంటలకు ఆరు లక్షల మందితో రాష్ట్ర వ్యాప్త రెడ్ల సింహగర్జన భారీ బహరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.5 వేల కోట్లతో చట్ట బద్ధతతో కూడిన ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, పేద రెడ్డి విద్యార్థులకు విదేశాల్లో చదువుల కోసం రూ.25 లక్షల సాయం అందించి చేయూత ఇవ్వాలన్నారు. 50 ఏండ్లు నిండిన రైతులందరికి నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, వయస్సుతో సంబంధం లేకుండా రైతులందరికి ఐదు లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హత సర్టిఫికేట్లకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 244 జీవోను వెంటనే అమలు చేయాలని కోరారు. రెడ్డి సింహగర్జన సభకు ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు ప్రకటించారు. సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్ రెడ్డి, రెడ్డి జాగతి, సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, మాడ నారాయణరెడ్డి, కాంతాల నారాయణరెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, చిటుకుల నర్సింహారెడ్డి, సరిగాని ఎల్లారెడ్డి, మూల ప్రభాకర్ రెడ్డి, జున్నోతుల రాజిరెడ్డి, రావుల కేశవరెడ్డి, పిట్ట శ్రీనివాస్ రెడ్డి, బుట్టగారి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.