Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రణాళిక బద్దమైన అభివృద్ధికి పట్టణ ప్రగతి దోహద పడుతుందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు జరిగే పట్టణ ప్రగతిపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్, డీసీి, హెల్త్ అండ్ శానిటేషన్ ఇతర విభాగాల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి 15 రోజులపాటు మాత్రమే కాదనీ, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ విషయంలో పారిశుధ్య కార్మికులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల జరిగిన బోయిగూడ అగ్ని ప్రమాదం, స్విమ్మింగ్‌పూల్ ఘటనలు వంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జరిగితే సర్కిల్, జోనల్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శానిటేషన్, సీఅండ్‌డీ వేస్ట్, పార్కుల నిర్వహణపై ఆరోపణలు రాకుండా చూడాలనీ, ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. సిటీలో నాలాల పూడికతీత పనులు చేపడుతున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పూడికతీత కార్యక్రమాల్లో సంబంధిత కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. క్లీనింగ్ మిషన్ పనితీరుపై రోజువారీ నివేదిక ఇవ్వాలన్నారు. శిథిలావస్థ భవనాలను గుర్తించి, నోటీసుల జారీతోనే సరిపెట్టకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. కమిషనర్ డీఎస్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మెరుగైన శానిటేషన్, పచ్చదనం పెంపుదల వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి టీమ్‌కూ తప్పనిసరిగా వాహనం ఏర్పాటు చేసుకోవాలన్నారు. డెంగ్యూ నివారణకు యాంటీ లార్వా చర్యలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. వార్డుల వారీగా నిర్మాణ వ్యర్థాలు, గ్రీన్వేస్ట్ సేకరణ సందర్భంగా తాత్కాలికంగా పాయింట్లను గుర్తించాలన్నారు. వార్డులో సేకరించిన వ్యర్థాలను తాత్కాలిక పాయింట్ వద్దకు, అక్కడి నుంచి పెద్ద వాహనాల ద్వారా డంపింగ్ యార్డులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో మరొకటి అదే ఎత్తులో గల మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం పచ్చదనంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను నిరంతరంగా కొనసాగించేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు తగిన సూచనలు ఇవ్వాలని చెప్పారు. హెల్త్ అండ్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ బి.సంతోష్ మాట్లాడుతూ ప్రతి రోజూ చేపట్టిన కార్యక్రమాలు రోజువారీగా నివేదిక అందజేయాలన్నారు. అడిషనల్ కమిషనర్ పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు పంకజ, మమత, రవికిరణ్, శంకరయ్య, సామ్రాట్ అశోక్, అదనపు కమిషనర్ కృష్ణ, ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు, డిప్యూటీ కమిషనర్లు, యూబీడీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.