Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
నవతెలంగాణ-బంజారాహిల్స్
కంటి ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన పెంచాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గ్రామ స్థాయిలో కంటి సమస్యల నివారణ, సంరక్షణను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం ఎల్వీ ప్రసాద్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో అనంత్ బజాజ్ రెటీనా ఇనిస్టిట్యూట్‌ను అంతర్జాల వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కీలకమైన వ్యక్తుల ద్వారా స్థానిక భాషల్లో మీడియా ప్రచారాలను నిర్వహించాలన్నారు. రెటినాల్ వ్యాధుల నివారణ కోసం ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రి, బజాజ్ గ్రూప్ సంయుక్తంగా చొరవ తీసుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. దష్టిలోప సమస్యలను ఎదుర్కోవడం కంటే నివారణే చక్కని మార్గమనే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించడం ద్వారా ప్రభుత్వ ప్రయత్నాలకు అండగా నిలవాలని ప్రయివేట్ ఆస్పత్రులకు సూచించారు. మొబైల్స్ లాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువుల వాడకం విషయంలో పిల్లలను తప్పనిసరిగా నియంత్రించాన్నారు. కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మెన్ డా.జి.ఎన్.రావు, బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ చైర్మెన్, ఎండీ శేఖర్ బజాజ్, అనంత్ బజాజ్ రెటీనా ఇనిస్టిట్యూట్ డైరక్టర్ డా.రాజ నారాయణన్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.